
రెండు వాహనాలు సహా ఎర్రచందనం స్వాధీనం: ఆరుగురి అరెస్టు
తిరుపతి రిజర్వు ఫారెస్టు నుంచి తమిళనాడుకు రెండు వాహనాల్లో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా వడమాలపేట పోలీసులు పట్టుకున్నారు.
వడమాలపేట : తిరుపతి రిజర్వు ఫారెస్టు నుంచి తమిళనాడుకు రెండు వాహనాల్లో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా వడమాలపేట పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేశారు. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప శుక్రవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. వడమాలపేట సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద స్థానిక ఎస్‌ఐ ఈశ్వరయ్య సిబ్బందితో కలిసి గురువారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి వైపు నుంచి వచ్చిన టవేరా, ఇన్నోవా వాహనాలను అనుమానంతో ఆపి తనిఖీ చే శారు. అందులో 27 ఎర్రచందనం దుంగలను గుర్తించారు.
వాహనాల్లో ప్రయూణిస్తున్న పొన్నుస్వామి, రాజ్‌కుమార్, అన్నామలై, పెరియస్వామి, ఇళయరాజ, విమల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు తమిళనాడులోని వెల్లిపురం, ధర్మపురి జిల్లాల నుంచి వచ్చినట్లు తెలిపారు. తిరుపతి సమీపంలోని శేషాచల అడవుల్లో దుంగలను నరికి వాహనాల్లో చెన్నైకి తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. వీటి విలువ 16లక్షల, 80వేల రూపాయలుగా అంచనావేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్, వడమాలపేట ఎస్‌ఐ ఈశ్వరయ్య, సిబ్బంది పాల్గొన్నారు.