స్థానిక ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మేకా విజయలక్ష్మి (32) గురువారం సాయంత్రం ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు.
బాపట్ల టౌన్: స్థానిక ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మేకా విజయలక్ష్మి (32) గురువారం సాయంత్రం ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా మార్టూరు మండ లం, రాజుపాలెం గ్రామానికి చెందిన విజయలక్ష్మికి ఏడాది క్రితం అదే మండలం పూనూరు గ్రామానికి చెందిన మేకా ఇస్సాక్‌తో వివాహమైంది. ఉద్యోగరీత్యా దంపతులు పట్టణంలోని భీమావారిపాలెం తాలింఖానా సమీపంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. విజయలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా.. ఎంటెక్ చేసిన ఆమె భర్త ఇస్సాక్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు.
గురువారం ఉదయం కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన విజయలక్ష్మి సాయంత్రం 6.30 గంటల సమయంలో మృతిచెందిందన్న సమాచారం తెలిసి విద్యార్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సమాచారం అందుకున్న మృతురాలి తల్లిదండ్రులు గోవతోటి రామారావు, రవికుమారిలు స్వగ్రామం నుంచి ఇక్కడకు చేరుకుని భోరున విలపించారు. తమ బిడ్డను అల్లుడే చంపి ఉం టాడని ఆరోపించారు. పదిరోజులుగా తరుచూ వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయారు. తమతో కూడా కనీసం మాట్లాడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కట్నం తీసుకురమ్మంటూ వేధిస్తున్నాడని, తమ బిడ్డను చంపి ఉరివేసుకుందని చెబుతున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్కగానొక్క కూతుర్ని చేతులారా చంపాడంటూ కన్నీరు మున్నీరుగా విలిపించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఉదయం తమ ఇద్దరి మధ్య కొద్దిపాటి ఘర్షణ చేసుకుందని మృతురాలి భర్త ఇస్సాక్ అంటున్నాడు. ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకుని సాయంత్రం తాను బజారు నుంచి వచ్చేసరికి విజయలక్ష్మి ఫ్యాన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఇస్సాక్ చెబుతున్నాడు. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.