‘పోలవరం ప్రాజెక్టుకు ప్రతిపక్షం ఆటంకాలు సృష్టిస్తోంది’

MP Vijaya Sai Reddy Comments After Meet With All Party Meeting - Sakshi

అఖిలపక్ష సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆదివారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం ముగిసింది. ఈ భేటీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డిలు హాజరయ్యారు. సమావేశం అనంతరం వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రతిపక్షం ఆటంకాలు సృష్టిస్తోందని, పోలవరం రివర్స్‌ టెండరింగ్‌తో రూ.800 కోట్లు ఆదా చేసినట్లు అఖిలపక్ష నేతల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాలను టెక్నికల్‌ కమిటీ ఆమోదించాలని కోరినట్లు పేర్కొన్నారు.  

అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన అంశాలివే..

  • ఆంధ్రప్రదేశ్‌కు ఏడు మెడికల్‌ కాలేజీలను మంజూరు చేయాలి.
  • బుందేల్ఖండ్‌ తరహాలో ఏపీలో వెనకబడిన జిల్లాలకు రూ. 700 కోట్ల ఇవ్వాలి.
  • మహిళా రిజర్వేషన్‌ బిల్లు తీసుకరావాలి.
  • బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్‌ కల్పించాలని
  • రామాయణపట్నంలో మేజర్‌ పోర్టు నిర్మించాలి
  • విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన వర్సిటీకి అనుమతినివ్వాలి
  • గోదావరి-కృష్ణ అనుసంధాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రం చేపట్టాలి

కాంగ్రెస్‌ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది
‘ఇక ఈ సమావేశంలో జైల్లో ఉన్న చిదంబరాన్ని పార్లమెంట్‌కు హాజరయ్యేలా అనుమతించాలని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ కోరారు. అయితే గతంలో కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన సమయంలో పార్లమెంట్‌కు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరితే అనుమతించలేదు. చిదంబరానికి ఒక న్యాయం వైఎస్‌ జగన్‌కు మరొక న్యాయం ఉండకూడదు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటోంది. కేంద్రం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. మా అధినేతపై తప్పుడు కేసులు పెట్టి 16 నెలల పాటు నిర్భంధించారు. కాంగ్రెస్‌ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. చిన్న పార్టీలకు కూడా సభలో కనీసం పది నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరాము’అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top