భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ 2015-16 సంవత్సరానికి పద్మ అవార్డుల కోసం అర్హత గల వారినుంచి
కడప కల్చరల్ : భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ 2015-16 సంవత్సరానికి పద్మ అవార్డుల కోసం అర్హత గల వారినుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సర్వీసులశాఖ సీఈఓ మమత ఒక ప్రకటనలో తెలిపారు. కళల విభాగంలో సంగీతం, చిత్రలేఖనం, శిల్పకళ, ఛాయాగ్రహణం, సినిమా, నాటకరంగం, సామాజిక రంగంలో సమాజ సేవ, ధర్మాదాయసేవ, సంఘ సేవ, సహకారసేవ అంశాలలో, ప్రజా వ్యవహారాల విభాగంలో న్యాయం, జన జీవితం, రాజకీయం తదితర అంశాలలో అర్హత గల వారు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
సైన్స్, ఇంజనీరింగ్ విభాగంలో స్పెస్ ఇంజనీరింగ్, న్యూక్లియర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్‌లో పరిశోధన, అభివృద్ధి, అనుబంధ అంశాలు, వాణిజ్యం, పరిశ్రమల విభాగంలో బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు, మేనేజ్‌మెంట్, పర్యాటక వాణిజ్య అభివృద్ధి అంశాలలో, వైద్య విభాగంలో వైద్య పరిశోధన, ఆయుర్వేదంలో గడించిన పేరు ప్రఖ్యాతులు, హోమియోపతి, సిద్ధ, అల్లోపతి, నేచురోపతిలో ప్రతిభగల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
విద్య, పాండిత్యం విభాగాలలో పత్రికా రచన, బోధన, పుస్తక రచన, పాండిత్యం, పద్యరచన, కవిత్వం, విద్యాభివృద్ధి, విద్యా సంస్కరణలు, అక్షరాస్యత, అభివృద్ధి, సివిల్ సర్వీస్ విభాగంలో ప్రభుత్వ సేవకుల పరిపాలన విశిష్టత, క్రీడల విభాగంలో వ్యాయామ క్రీడలు, పేరుగాంచిన క్రీడలు, సాహస క్రీడలు, పర్వతారోహణ, క్రీడా నైపుణ్యం, యోగా తదితర అంశాలతోపాటు భారతీయ సంస్కృతిని ప్రచారం చేయడం, మానవ హక్కుల సంరక్షణ, వన్యప్రాణ సంరక్షణ విభాగాలలో అర్హత గలవారు పద్మ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
దరఖాస్తులు స్టెప్ కార్యాలయంలోగానీ, హెచ్‌టీపీపీ://ఎంహెచ్‌ఏ.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా పొందవచ్చన్నారు. దరఖాస్తులు ఆంగ్లంలో మత్రమే పూరించాలని, జులై 8వ తేదీలోగా దరఖాస్తు పంపాల్సి ఉంటుందని ఆమె వివరించారు. ఇతర వివరాలకు 08562-241617 నెంబరులో సంప్రదించాలన్నారు.