కేంద్ర మంత్రుల పర్యటనతో కొల్లేరు గ్రామాల్లో ఉత్కంఠత నెలకొంది. ఈ సారైనా ఎన్నికల హామీలు నెరవేరతాయో లేదో అన్న
కైకలూరు : కేంద్ర మంత్రుల పర్యటనతో కొల్లేరు గ్రామాల్లో ఉత్కంఠత నెలకొంది. ఈ సారైనా ఎన్నికల హామీలు నెరవేరతాయో లేదో అన్న మీమాంస ప్రజలను వేధిస్తోంది. ఎన్నికల ప్రచారంలో కొల్లేరు సమస్యలను పరిష్కరిస్తామని ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. కొల్లేటి సమస్యల పరిష్కారంపై గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు.కేంద్ర అటవి, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తొలిసారిగా శుక్రవారం కొల్లేటికోటకు వస్తున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొల్లేరు గ్రామాల నుంచి 25 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
కాంటూరు లెక్కల్లో గందరగోళం
కొల్లేరు కాంటూరు లెక్కల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో +5 కాంటూరు పరిధి వరకు 77 వేల 138 ఎకరాలను అభయారణ్యంగా 1999లో విడుదల చేసిన 120 జీవోలో పేర్కొన్నారు. ఇప్పుడు కొల్లేరు ప్రజలు కోరినట్లుగా +5 కాంటూరు నుంచి +3 కాంటూరు వరకు కుదిస్తే 33 వేల 361 ఎకరాలకు తగ్గుతుంది. అంటే 43 వేల 777 ఎకరాలు మిగులు భూమిని రెండు జిల్లాల్లోని 90 వేల కుటుంబాలకు పంపిణీ చేయవచ్చు. కైకలూరుకు చెందిన సామాజిక కార్యకర్త గూడపాటి కృష్ణమోహన్ మాత్రం +5 కాంటూరు వరకు లక్షా 21 వేల 600 ఎకరాల అభయారణ్య భూమి ఉందన్నారు. కొందరు కావాలనే 77వేల 138 ఎకరాలుగా చూపించారని, కొల్లేరు ఆపరేషన్ సమయంలో కృష్ణాజిల్లాలో 7500 ఎకరాలు అదనంగా ధ్వంసం చేశారనే వాదనలో నిజం లేదని తేల్చిచెప్పారు. కొల్లేరులో +5 కాంటూరు వరకు ఇంకా 45 వేల భూములను అభయారణ్యం పరిధిలోకి తీసుకోవాల్సి ఉందని, ప్రస్తుతం పంపిణీ చేస్తామంటున్న 7500 ఎకరాలను ఏ విధంగా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తున్నారు.
సుప్రీంకోర్టు పరిధిలో అంశం
కొల్లేరు అంశం సుప్రీకోర్టు పరిధిలో ఉంది. అక్కడ కేంద్ర సాధికారిత కమిటీ నిర్ణయాల ప్రకారం కొల్లేరులో పనులు జరగాలి. ఈ కారణంగానే కొల్లేరు పెద్దింట్లమ్మ వారిధి నిర్మాణం నిలిచింది. కొల్లేరు కాంటూరు కుదింపు జరగాలంటే ప్రధాని ఛైర్మన్‌గా ఉన్న పర్యావరణ కమిటీ నిర్ణయం తీసుకుని పార్లమెంటులో బిల్లు పెట్టాలి. ఇటీవల కొల్లేరులో అక్రమ చెరువులు పెరిగాయంటూ కొందరు కోర్టులో పిల్ వేశారు. మంత్రులు చూద్దాం.. చేద్దాం.. అంటే మరోసారి నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంది.