విశాఖ చేరుకున్న ప్రత్యేక నిపుణుల బృందం

Group Of Experts Trying To Prevent Gas Leak In LG Polymers - Sakshi

సాక్షి, విశాఖపట్నం : గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో గురువారం తెల్లవారుజామున స్టైరిన్‌ గ్యాస్‌ లీకైన సంగతి తెలిసిందే. గ్యాస్‌ లీకేజీని అరికట్టేందుకు 9 మంది నిపుణులతో కూడిన బృందం అర్థరాత్రి తరువాత విశాఖకు చేరుకుంది. కాగా గ్యాస్‌ లీకేజీని అరికట్టేందుకు 9మంది నిపుణుల బృందం ప్రయత్నిస్తుంది. అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్న విశాఖ పోలీస్‌ కమిషనర్‌  ఆర్‌కే మీనా, డీసీపీ ఉదయ్‌భాస్కర్‌లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లీకేజీని అరికట్టే సమయంలో పేలుడు సంభవిస్తుందనేది పుకారు మాత్రమేనని ఆర్‌కే మీనా పేర్కొన్నారు.  ముందుజాగ్రత్త చర్యగా ఫ్యాక్టరీ నుంచి కిలోమీటర్‌ దూరం వరకు ఉన్న గ్రామాల ప్రజలను ఖాళీ చేయించామన్నారు. గ్యాస్‌లీకేజీ అరికట్టే సమయంలో ఇబ్బందులు ఎదురైనా పేలుడులాంటి ఘటనలుండవని, ప్రజలెవరూ పుకార్లను నమ్మవద్దన్నారు. (విశాఖ విషాదం)

కాగా ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 300 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గ్యాస్‌ లీకేజీ ప్రాంతాన్ని సందర్శించడంతో పాటు బాధితులను పరామర్శించారు. చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. కంపెనీ పునఃప్రారంభమైన తర్వాత, లేదంటే వేరొక చోటుకు తరలించిన తర్వాతైనా సరే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. అలాగే వెంటిలేటర్‌ సాయంతో వైద్యం పొందుతున్న వారికి రూ.10 లక్షలు.. రెండు మూడు రోజుల పాటు చికిత్స అవసరమైన వారికి రూ.లక్ష.. ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్యం చేయించుకున్న వారికి రూ.25 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాం. (‘కోటి’ సాయంపై సర్వత్రా హర్షం)

పీటీబీసీ రసాయనాలు రప్పించారు
విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి విడుదలైన విష వాయువులను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. పరిశ్రమలు అత్యధికంగా ఉన్న గుజరాత్‌ నుంచి ఇందుకు అవసరమైన రసాయనాలను తెప్పించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీకి గురువారం ఉదయం ఫోన్‌ చేశారు. విశాఖ దుర్ఘటన గురించి వివరించారు. విష వాయువుల తీవ్రతను తగ్గించడంలో ఉపకరించే పారా టెరిటరీ బ్యూటైల్‌ కాటెకాల్‌ (పీటీబీసీ) కెమికల్స్‌ గుజరాత్‌లోని వాసి నగరంలోని పారిశ్రామికవాడల్లో పెద్ద ఎత్తున తయారవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ రసాయనాలను వెంటనే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యరి్థ, అనిల్‌ అంబానీ సన్నిహితుడు పరిమళ్‌ నత్వానీతోనూ సంప్రదింపులు జరిపారు. ఇదే అంశంపై మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖను సంప్రదించింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించి పీటీబీసీ రసాయనాన్ని వెంటనే సరఫరా చేయాలని ఆదేశించింది. దాంతో గుజరాత్‌లోని వల్సద్‌ జిల్లా వాపీలోని పరిశ్రమ నుంచి 500 కేజీల రసాయనాన్ని దామన్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం తరలించారు. ఎల్జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ నుంచి స్టైరీన్‌ గ్యాస్‌ లీక్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఈ పీటీబీసీ రసాయనాన్ని పిచికారి చేస్తారు. తద్వారా స్టైరీన్‌ వాయువును నిరీ్వర్యం చేస్తారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్టైరీన్‌ గ్యాస్‌ను నిర్వీర్యం చేయడానికి శాస్త్రీయ చర్యలకు ఉపక్రమించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top