పందెం కోడికి భలే గిరాకీ

Fighting Hens Have More Demand In Market At Krishna District - Sakshi

మచిలీపట్నంలో మొదలైన సంక్రాంతి సందడి

జాతికోళ్ల కోసం జల్లెడ పడుతున్న పందెంరాయుళ్లు 

రంగును బట్టి పరుగులు పెడుతున్న పుంజుల రేట్లు

సాక్షి, కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. మరో మూడు వారాల్లో సంక్రాంతి పండుగ రానే వస్తుంది. పండుగ మరో 20 రోజులు ఉండగానే సంక్రాంతి సరదాలు మొదలయ్యాయి. ఏ రంగుపై ఏ రంగు కోడిని వదలాలి, ఏది గెలుస్తుంది ఏది ఓడిపోతుందనే çముచ్చట్లు మండలంలో మొదలయ్యాయి. క్రితం పండక్కి నా రసంగి, కాకిని నేలకరిపించిందిరా బావ అంటే... నీ రసంగి కాకినే కొట్టింది నా నెమలి అయితే రంగుతో పని లేకుండా నాలుగు పందేలే చేసింది రా బావ అంటూ పందెంరాయుళ్లు ముచ్చట్లు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా మరో 20 రోజుల్లో సంకాంత్రి సందడి మొదలు కానుండటంతో ఎక్కడ చూసినా కోడిపందేలా ముచ్చట్లే వినబడుతున్నాయి.   

జాతిపుంజుల కోసం జల్లెడ  
సంక్రాంతి సమీపిస్తుండటంతో పందెంకోళ్ల కోసం పందెంరాయుళ్లు పరుగులు పెడుతున్నారు. పందెంకోడి కూతపెడితే చాలు చటుక్కున ఆగి బేరసారాలు మొదలెడుతున్నారు. రంగును బట్టి ధర నిర్ణయించి డబ్బులు విసిరేస్తున్నారు. పుంజు నచ్చితే చాలు రేటు గురించి ఆలోచించకుండా చటుక్కున చంకలో పెట్టుకుంటున్నారు. పండుగ మరో 20 రోజులు మాత్రమే ఉండటంతో పందెంకోళ్లను బరుల్లోకి వదిలేందుకు సిద్ధం చేస్తున్నారు. అందుకోసం జీడిపప్పు, పిస్తా, కోడిగుడ్లుతో పాటు మరింత ఖరీదైన మేతలతో కోళ్లను పసిపిల్లల్లా సాకుతున్నారు. రంగును బట్టి పందెకోళ్లకు గిరాకీ ఉండటంతో నచ్చిన కోడిని కొనుక్కునేందుకు పందెంరాయుళ్లు వెనుకడుగు వేయటంలేదు. కాకి, పచ్చకాకి, డేగ, కాకిడేగ, నెమలి, సీతువా, రసంగి, పర్లా, కక్కిరి, మైలా ఇలా రంగులను బట్టి ఒక్కో కోడి రూ.5000 నుంచి రూ.10000 మధ్య  పలుకుతుండగా, జాతికోళ్లు అయితే రూ.8000 నుంచి రూ. 15,000 వరకు పలుకుతున్నాయి. అయితే రంగు నచ్చి కోడిపై మోజుపడితే చాలు పందెంరాయుళ్లు వాటిని కొనేందుకు ఏమాత్రం వెనుకాడటంలేదు.

సండే మార్కెట్‌లో సందడి
సంక్రాంతి సమీపిస్తుండటంతో సండే మార్కెట్‌లో సందడి మొదలైంది. మిగిలిన రోజుల్లో కూర కోళ్లకు మాత్రమే గిరాకీ ఉండగా గత రెండు వారాలుగా పందెంపుంజులు మార్కెట్‌లో కూతలు పెడుతున్నాయి. దీంతో గత రెండు ఆదివారాలుగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పందెంరాయుళ్లు పందెం పుంజుల కోసం సండే మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో చేరతున్నారు. మచిలీపట్నంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పందెంరాయుళ్ళు సండే మార్కెట్‌లో పందెంకోళ్లు కోసం పడిగాపులు పడుతున్నారు. కోడి రంగు, పోట్లాట, కోడి సైజును బట్టి బేరసారాలు చేసి నచ్చిన పుంజులను పట్టుకుపోతున్నారు. దీంతో బందరు నియోజకవర్గంలో మూడు వారాల ముందుగానే సంక్రాంతి సందడి మొదలైనట్లు కనబడుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top