‘చిన్న తరహా పరిశ్రమలకు అనుమతి ఇచ్చాం’

East Godavari Collector Muralidhar Reddy Speech About Coronavirus - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: కరోనా(కోవిడ్-19) ప్రభావిత ప్రాంతాలను మూడు జోన్లుగా కేంద్రం నిర్ణయించగా తూర్పుగోదావరి జిల్లా ఆరెంజ్‌ జోన్‌లో ఉందని జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మే 1న జిల్లాలో మళ్లీ తునిలో తొలి కేసు నమోదైందని ఆయన తెలిపారు. పాజిటివ్ కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్ల ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. జిల్లాలో 12 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయని ఆ ప్రాంతాల్లో ఎటువంటి సడలింపులు లేవని ఆయన స్పష్టం చేశారు. (కరోనా: ఏపీలో మరో 58 పాజిటివ్‌ కేసులు)

రాజమండ్రి, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, తుని, ప్రాంతాల్లో కంటైమెంట్ జోన్లు ఉన్నాయన్నారు. కంటైన్‌మెంట్ మినహా మిగతా ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉంటుందని ఆయన తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో 33 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రజలు హ్యాండ్ వాష్, ఫేస్ మాస్క్ తప్పనిసరిగా వినియోగించాలని ఆయన సూచించారు. భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. ఆటోల్లో ఇద్దరు, కారులో ముగ్గురు, టూ వీలర్ వాహనాల్లో ఒక్కరు మాత్రమే ప్రయాణించాలని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు.

జిల్లాలో 12, 372 శాంపిల్స్ పరీక్షిస్తే, 45 పాజిటివ్ కేసులు నమోదు కాగా 17 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. ప్రతీరోజు 5 నుంచి 6 వందల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ వెల్లడించారు. హెల్త్, శానిటేషన్ సిబ్బందికి హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. జిల్లాలో ఆరు కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. జిల్లాకు చెందిన కరోనా బాధితులంతా కోలుకుంటున్నారని, ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 65 చిన్న తరహా పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని రేపటి (సోమవారం) నుంచి గ్రీన్‌జోన్‌లోని పరిశ్రమలు నిబంధనలు అనుసరిస్తూ కార్యకాలపాలు చేపట్టవచ్చని ఆయన వివరించారు.

జిల్లాలో 2765 మంది వలస కార్మికులు ఉన్నట్టు గుర్తించామని ఆయన తెలిపారు. వీరిలో 885 మంది ఏపిలో వివిధ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా వారిని సొంత ఊర్లకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. సొంత వాహనాలు ఉంటే సొంత ఊర్లు వెళ్లేందుకు అనుమతిస్తామని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. గ్రీన్‌జోన్‌లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారపు సంతలు, సభలు సమావేశాలకు అనుమతి లేదని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top