అధైర్యపడకండి అండగా ఉంటాం | CM YS Jagan assures Boat Accident Victims | Sakshi
Sakshi News home page

అధైర్యపడకండి అండగా ఉంటాం

Sep 17 2019 4:56 AM | Updated on Sep 17 2019 6:16 AM

CM YS Jagan assures Boat Accident Victims - Sakshi

బోటు ప్రమాదంలో భర్త, కుమార్తెను కోల్పోయి రోదిస్తున్న మధులతను ఓదార్చుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి బృందం, రాజమహేంద్రవరం: బోటు ప్రమాదం నుంచి బయటపడి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. 21 మంది బాధితులు, వారి కుటుంబ సభ్యులకు తానున్నానని భరోసా ఇచ్చారు. ఒక్కో బాధితుడి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరు, ఆసుపత్రిలో అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన కొంత మంది సీఎం జగన్‌ను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇళ్లకు పంపాలని మంత్రులకు సూచించారు. ఆస్పత్రిలో ఒక్కొక్కరినీ పలకరిస్తున్న సమయంలో వారి హృదయాల్లో నుంచి వస్తున్న ఆవేదనను చూసి సీఎం భావోద్వేగానికి గురయ్యారు. 

ధైర్యంగా ఉండమ్మా..

భర్త, కుమార్తెను కోల్పోయిన తిరుపతికి చెందిన మధులతను పలకరించిన సందర్భంలో ఆమె పరిస్థితిని చూసి చలించిపోయారు. కొద్దిసేపు అలానే ఉండిపోయారు. ‘భర్త, కూతుర్ని కోల్పోయి అనాథనయ్యాను. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. కాలు కింద పెట్టకుండా పెంచుకున్నాను. నేను చనిపోతే నాకు ఎవరు తలకొరివి పెడతారని అడిగితే అమ్మా.. జగనన్నకు ఉన్నది కూడా ఇద్దరు కుమార్తెలు.. వాళ్లలాగనే నేనూ చూసుకుంటానని చెప్పింది. స్కూల్లో, అల్లరిలో ఫస్ట్‌. నాకు బతకాలని కూడా లేదు. కనీసం నా భర్తను, చిన్నారిని ఒక్కసారి కడసారి చూపు చూపించన్నా..’ అంటూ మధులత గద్గద స్వరంతో సీఎంను పట్టుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. ‘మీరొస్తూనే కరప్షన్‌ కనపడదని చెప్పారన్నా.. పోలీసులను వదలకండి.. మూడు నాలుగు వేలకు కక్కుర్తిపడి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆపిన బోటును మళ్లీ పంపించేశారు. మరొకరికి ఈ పరిస్థితి రాకూడదన్నా.. ఎన్ని కుటుంబాలు నడిరోడ్డున పడ్డాయో చూస్తున్నారు కదన్నా..’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెను పరామర్శించిన సీఎం.. ధైర్యంగా ఉండాలంటూ సముదాయించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  

మీరు ఎక్కింది ఏ బోటు?
‘మీరు ప్రయాణించింది ఏపీ టూరిజం బోటా, ప్రైవేటు బోటా’ అని సీఎం జగన్‌.. ప్రాణాలతో బయటపడిన తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్న నలుగురు ఏఈలు సాలేటి రాజేష్, శివ శంకర్, నార్లపురం సురేష్, మేడి కిరణ్‌ కుమార్‌లను ప్రశ్నించారు. ‘ప్రభుత్వ టూరిజం బోట్లు తిరగడం లేదని వెబ్‌సైట్‌ చూస్తే తెలిసింది. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో డేంజర్‌ అని చూపించింది. దీంతో బోటు నిర్వాహకులను పర్యటనకు రావచ్చా.. అని అడిగాం. వరద తగ్గిపోయింది ఇబ్బంది లేదని చెప్పడంతో బయలుదేరి వచ్చాం. తీరా ఇక్కడ ఇలా జరుగుతుందని అనుకోలేదన్నా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇది ప్రైవేటు బోటు.. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఇంత మంది ప్రాణాలు పోయాయన్నా.. అని శివశంకర్‌ కన్నీటిపర్యంతమయ్యాడు. మీరు గట్టి నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నా.. అని విన్నవించాడు.   

ఆరోగ్యం ఎలా ఉంది?

వరంగల్‌ జిల్లా కడిపి కొండకు చెందిన బసికె దశరథు వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును బాధితుడు ముఖ్యమంత్రికి వివరించారు. ఆస్పత్రిలో అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలంటూ సూచించారు. వరంగల్‌ జిల్లా కడిపికొండ గ్రామానికి చెందిన దర్శనాల సురేష్‌ను సీఎం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన నుంచి తేరుకొని ధైర్యంగా ఉండాలని సూచించారు. ఇదే గ్రామానికి చెందిన గొర్రె ప్రభాకర్‌నూ సీఎం పరామర్శించి.. బోటులో ఎంత మంది ప్రయాణించారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కడిపికొండ గ్రామానికి చెందిన బసికె వెంకట స్వామి, యాదగిరిలు సీఎంకు సంఘటన గురించి వివరిస్తూ.. తాము  14 మందిమి బోటులో వెళ్లగా ఐదుగురం బయటపడ్డామని, ఇద్దరి మృతదేహాలు లభించాయని, మరో ఏడుగురి ఆచూకీ తెలియలేదని వివరించారు. త్వరలోనే అన్ని మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని సీఎం  పేర్కొన్నారు.  

మా వాళ్ల ఆచూకీ తెలపండి సార్‌..
హైదరాబాద్‌ హయత్‌ నగర్‌కు చెందిన కె.అర్జున్, జర్నికుమార్‌లను పరామర్శించిన సీఎం జగన్‌ను చూసి అర్జున్‌ తండ్రి బోరున విలపించారు. ఈ ప్రమాదంలో తమ బిడ్డలు భరత్‌ కుమార్, విశాల్‌ గల్లంతయ్యారని తెలిపారు. త్వరలోనే వారి ఆచూకీ లభిస్తుందని, ధైర్యంగా ఉండాలని వైఎస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన సి.హెచ్‌ జానకి రామారావుతో ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తనతో పాటు భార్య శివజ్యోతి, బావ పవన్‌ కుమార్, సోదరి వసుంధర, వారి కుమారుడు సుశీల్‌లు బోటులో ప్రయాణించామని, ఇప్పుడు తానొక్కడినే మిగిలానని కన్నీటిపర్యంతమయ్యారు. వారి ఆచూకీ త్వరగా కనుక్కోవాలని కోరారు. కాగా, ప్రమాద స్థలిలో ఏరియల్‌ సర్వే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరామర్శ, సహాయ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి 3.20 గంటలకు తాడేపల్లి చేరుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement