వెంకటేశ్వర నగర్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. ఆమె తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.
– తల్లికి తీవ్ర గాయాలు
కర్నూలు: వెంకటేశ్వర నగర్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. ఆమె తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు..హైదరాబాద్–బెంగుళూరు జాతీయ రహదారి పక్కన ఉన్న కృష్ణాభవన్ సమీపంలోని వెంకటేశ్వర నగర్‌లో సుగాలి వెంకటనాయక్ నివాసముంటున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో వెంకటనాయక్ భార్య సుబ్బులుబాయి చిన్న కూతురు మధుర మీనాక్షితో కలసి (రెండున్నరేళ్లు) ఇంటి ముందు నిలబడి పక్కింటి వారితో మాట్లాడుతోంది.
అదే కాలనీలో నివాసముంటున్న మిన్నల్ల కుమారుడు మైనర్ బాలుడు సయ్యద్ మహబూబ్ బాషా(14) (ఏపీ20ఏ 2593) మారుతీ కారును వేగంగా మలుపు తీసుకుని అదుపు చేసుకోలేక తల్లి, కూతుళ్లను ఢీకొట్టాడు. ఇద్దరికీ బలమైన రక్తగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మధుర మీనాక్షి మృతి చెందింది. తల్లి సుబ్బులుబాయికి కాలు విరిగింది.
నాలుగో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మైనర్ బాలుడు వాహనాన్ని వదిలేసి పారిపోవడంతో పోలీసులు ఆధారాలను సేకరించారు. వెంకటనాయక్‌కు నలుగురు సంతానం కాగా ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి చివరి కూతురు. విషయం తెలిసిన వెంటనే బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. వెంకటనాయక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగో పట్టణ సీఐ నాగరాజరావు తెలిపారు.