రైలు ప్రమాదం ఘటనలో సీసీఐ(సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఉద్యోగి ప్రతాప్‌వినయ్(43) జాడ ఇంకా తెలియరాలేదు.
తాండూరు, న్యూస్‌లైన్: రైలు ప్రమాదం ఘటనలో సీసీఐ(సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఉద్యోగి ప్రతాప్‌వినయ్(43) జాడ ఇంకా తెలియరాలేదు. దీంతో ఆయన కుటుంబసభ్యులతో పాటు సీసీఐ వర్గాలు కలవరపడుతున్నాయి. శుక్రవారం రాత్రి ప్రతాప్‌వినయ్ బెంగళూరు నుంచి తాండూరుకు బయలుదేరారు. ఆయన బెంగళూరు-నాందేడ్ లింక్‌ప్రెస్‌లో బీ-1 ఏసీ బోగీ (బెర్తు 21)లో ఎక్కారు. మార్గంమధ్యలో శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలో బెంగళూరు-నాందేడ్ లింక్ ఎక్స్‌ప్రెస్ బీ1 బోగీ అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతాప్‌వినయ్ జాడ తెలియరాలేదు. అనంతపురంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఆయన జాడ కనిపించలేదు. సీసీఐ ఉద్యోగి ప్రతాప్‌వినయ్ సెల్‌ఫోన్ నంబర్ 7382624267కి కాల్ చేయగా స్విచ్చాఫ్ వస్తోంది.
దీంతో కుటుంబీకులు, బంధువులు సీసీఐ వర్గాలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. సీసీఐ కర్మాగారం నుంచి అధికారులు శనివారం తాండూరు నుంచి బెంగళూరుకు వెళ్లారు. అక్కడ విక్టోరియా ఆస్పత్రి వద్ద తమ ఉద్యోగి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. శనివారం రాత్రి వరకూ తన భర్త ఆచూకీ లభిస్తుందని ఎదురు చూసిన కరన్‌కోట్‌లోని ప్రతాప్ వినయ్ భార్య శ్వేతాసింగ్, ఇద్దరు పిల్లలు ఫలితం లేకపోవడంతో తల్లడిల్లిపోయారు. ఆదివారం వారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లినట్లు సీసీఐ వర్గాల సమాచారం. ప్రతాప్ వినయ్ సుమారు 16 సంవత్సరాల క్రితం పాట్నా నుంచి తాండూరుకు వచ్చి సీసీఐ కర్మాగారంలో ఎలక్ట్రికల్ విభాగంలో మెకానిక్‌గా పని చేస్తున్నారు. ఉద్యోగులు,అధికారులతో కలివిడిగా ఉండే ఆయన జాడ తెలియకపోవడం అందరినీ బాధిస్తోంది. తాండూరు, గుంతకల్లు, తదితర రైల్వేస్టేషన్‌ల వద్ద రైల్వే అత్యవసర సమాచారం సేవలను నిలిపివేశారు. బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి నుంచే ఈ సేవలను అందిస్తున్నట్లు సమాచారం. సీసీఐ ఉద్యోగి ప్రతాప్‌వినయ్ సమాచారం తమకు అందలేదని తాండూరు రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు.