breaking news
Pratap vinay
-
సీసీఐ ఉద్యోగి విషాదాంతం
తాండూరు, న్యూస్‌లైన్: ఆ కుటుంబం ఆశలు గల్లంతయ్యాయి. భర్త సురక్షితంగా ఉన్నాడని ఆశించిన ఆ ఇల్లాలికి.. తండ్రి క్షేమంగా ఉంటాడని ఆశగా ఎదురుచూసిన పిల్లలకు చివరికి కన్నీళ్లే మిగిలాయి. గాయాలైనా కనీసం ప్రాణాలతోనైనా తిరిగి వస్తాడనుకున్న ఆ కుటుంబ సభ్యుల ఆశలు అడియాసల య్యాయి. అనంతపురం జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాద ఘటన సీసీఐ ఉద్యోగి ప్రతాప్ వినయ్ భార్య, ఇద్దరు పిల్లలకు తీరని వేదనను మిగిల్చింది. తోటి ఉద్యోగులతోపాటు సీసీఐ అధికార వర్గాల్లో విషాదాన్ని నింపింది. దైవ దర్శనానికి వెళ్లిన సీసీఐ ఉద్యోగి ప్రతాప్ వినయ్ (43) రైలు ప్రమాద ఘటనలో మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలో శనివారం తెల్లవారుజామున బెంగళూరు- నాందేడ్ లింక్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనలో గల్లంతైన ప్రతాప్ వినయ్ దుర్మరణం చెందినట్లు బెంగళూరు వెళ్లివచ్చిన సీసీఐ అధికారి ఉపాధ్యాయ సోమవారం నిర్ధారించారు. వినయ్ ప్రతాప్ మృతదేహానికి మంగళవారం పాట్నాలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన చెప్పారు. మృతదేహాన్ని ఇలా గుర్తించారు.. ప్యాంట్ ఇన్నర్ జేబులో ఉన్న బంగారు ఉంగరం, తాండూరులో బట్టలు కుట్టిన టైలర్‌షాపు పేరు ఆధారంగా ప్రతాప్ వినయ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించినట్టు సీసీఐ ఉద్యోగి చంద్రశేఖర్‌రావు ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. జీర్ణించుకోలేని సీసీఐ వర్గాలు... కరన్‌కోట్ నుంచి శనివారం బెంగళూ రు ఆసుపత్రికి వెళ్లిన భార్య శ్వేతాసిం గ్, కూతురు శ్రీమి సింగ్(15), కొడుకు ప్రశాంత్జోష్(11)లతోపాటు అక్కడికి చేరుకున్న ఇతర కుటుంబ సభ్యులు... ప్రతాప్‌వినయ్ ఇక లేరనే వార్తతో షాక్ కు గురయ్యారు. వైద్యపరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సుమారు 16ఏళ్లుగా సీ సీఐ ఎలక్ట్రికల్ విభాగంలో మెకానిక్‌గా పని చేసిన ప్రతాప్ వినయ్ మృతిని తోటి ఉద్యోగులు, ఇతర అధికారులు, కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఎప్పుడూ అందరితో కలిసిమెలిసి ఉంటూ ప్రేమగా మాట్లాడే వారని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి కర్మాగారం గేట్ ఎదుట ఉద్యోగులు, కార్మికులు కొవ్వొత్తులు వెలిగించి ప్రతాప్వినయ్కు ఘనంగా నివాళులర్పించారు. -
వీడని వేదన!
తాండూరు, న్యూస్‌లైన్: రైలు ప్రమాదం ఘటనలో సీసీఐ(సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఉద్యోగి ప్రతాప్‌వినయ్(43) జాడ ఇంకా తెలియరాలేదు. దీంతో ఆయన కుటుంబసభ్యులతో పాటు సీసీఐ వర్గాలు కలవరపడుతున్నాయి. శుక్రవారం రాత్రి ప్రతాప్‌వినయ్ బెంగళూరు నుంచి తాండూరుకు బయలుదేరారు. ఆయన బెంగళూరు-నాందేడ్ లింక్ప్రెస్లో బీ-1 ఏసీ బోగీ (బెర్తు 21)లో ఎక్కారు. మార్గంమధ్యలో శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలో బెంగళూరు-నాందేడ్ లింక్ ఎక్స్‌ప్రెస్ బీ1 బోగీ అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతాప్‌వినయ్ జాడ తెలియరాలేదు. అనంతపురంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఆయన జాడ కనిపించలేదు. సీసీఐ ఉద్యోగి ప్రతాప్‌వినయ్ సెల్‌ఫోన్ నంబర్ 7382624267కి కాల్ చేయగా స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో కుటుంబీకులు, బంధువులు సీసీఐ వర్గాలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. సీసీఐ కర్మాగారం నుంచి అధికారులు శనివారం తాండూరు నుంచి బెంగళూరుకు వెళ్లారు. అక్కడ విక్టోరియా ఆస్పత్రి వద్ద తమ ఉద్యోగి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. శనివారం రాత్రి వరకూ తన భర్త ఆచూకీ లభిస్తుందని ఎదురు చూసిన కరన్‌కోట్‌లోని ప్రతాప్ వినయ్ భార్య శ్వేతాసింగ్, ఇద్దరు పిల్లలు ఫలితం లేకపోవడంతో తల్లడిల్లిపోయారు. ఆదివారం వారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లినట్లు సీసీఐ వర్గాల సమాచారం. ప్రతాప్ వినయ్ సుమారు 16 సంవత్సరాల క్రితం పాట్నా నుంచి తాండూరుకు వచ్చి సీసీఐ కర్మాగారంలో ఎలక్ట్రికల్ విభాగంలో మెకానిక్‌గా పని చేస్తున్నారు. ఉద్యోగులు,అధికారులతో కలివిడిగా ఉండే ఆయన జాడ తెలియకపోవడం అందరినీ బాధిస్తోంది. తాండూరు, గుంతకల్లు, తదితర రైల్వేస్టేషన్ల వద్ద రైల్వే అత్యవసర సమాచారం సేవలను నిలిపివేశారు. బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి నుంచే ఈ సేవలను అందిస్తున్నట్లు సమాచారం. సీసీఐ ఉద్యోగి ప్రతాప్‌వినయ్ సమాచారం తమకు అందలేదని తాండూరు రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు.