అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నిఘా | Candidates election Cost Special vigilance | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నిఘా

Mar 2 2014 2:23 AM | Updated on Sep 2 2018 4:46 PM

రాబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంటుందని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. ఎన్నికల వ్యయం ధరల నిర్ధారణపై

 శ్రీకాకుళం, న్యూస్‌లైన్: రాబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంటుందని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. ఎన్నికల వ్యయం ధరల నిర్ధారణపై మీడియా ప్రకటనల విభాగం, హోటల్స్, క్లాత్ మర్చంట్స్, ట్రావెల్ సంస్థలు, షామియాన, మైక్, లైటింగ్ తదితర సంస్థలతో కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలో నిలిచే అభ్యర్థులు ప్రచార కార్యక్రమంలో వినియోగించే సేవలకు అరుున ఖర్చు వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రచారంలో అభ్యర్థులు భోజనాలు, విందులు ఏర్పాటుచేయరాదన్నారు.
 
 నగదు పంపిణీ, మద్యం విక్రయూల నియంత్రణకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పరిమితికి మించి ఖర్చు చే సే అభ్యర్థులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖర్చులో 40 శాతం మీడియూలో ప్రచారానికి వినియోగించే అవకాశం ఉందన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రజాప్రతినిధుల చట్టం 1951, ఎన్నికల నిర్వహణ చట్టం 1961, ఇండియన్ పీనల్ కోడ్ 1860, ఆదాయపు పన్ను చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు. 
 
 అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఫలితాలు వెల్లడైనంత వరకు సెక్షన్-10 ఏ ప్రకారం వివిధ శాఖలు ఖర్చులను లెక్కిస్తామన్నారు. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన రోజునే నూతనంగా బ్యాంకు ఖాతాను తెరచి వివరాలను రిటర్నింగ్ అధికారికి అందించాలన్నారు. ఆ ఖాతా నుంచే చెల్లింపులు జరపాలని సూచించారు. పోస్టర్లు , కరపత్రాలు ముద్రించే సంస్థలు వాటిపై తమ పేరు, చిరునామాను స్పష్టంగా ముద్రించాలని ఆదేశించారు. రూ. 50 వేలకు పైబడి రవాణా చేస్తే వాటి వివరాలు విధిగా చూపించాలన్నారు. రూ. 10వేలు దాటిన మద్యం, గిఫ్ట్ ఆర్టికల్స్ రవాణా చేయడం నేరమన్నారు. ఏజేసీ ఎండీ హషీమ్ షరీఫ్ మాట్లాడుతూ వివిధ సంఘాలు తమ సరఫరా చేసే ధరల వివరాలను ఈ నెల 3 నాటికి అందించాలన్నారు.
 
 మీడియా సర్టిఫికేషన్, మోనిటరింగ్ కమిటీ కింద పెయిడ్ న్యూస్, ప్రకటనలు ఇటీవల కాలంలో అధికంగా వస్తున్నాయని, వీటిపై ఎన్నికల సంఘం దృష్టి సారించిందని చెప్పారు. ప్రకటనలకు కనీసం మూడు రోజుల ముందు ఎంసీఎంసీ కమిటీ నుంచి అనుమతి పొందాలన్నారు. మీడియాలో ఒక అభ్యర్థికి అనుకూలంగా ప్రజలను ప్రభావితం చేసే వార్తలు, ఫొటోలు పెయిడ్ న్యూస్‌గా పరిగణించడం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో రవాణా శాఖ ఉపకమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు, డీపీఆర్వో ఎల్.రమేష్, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సత్యనారాయణ, మీడియా ప్రకటన విభాగం ప్రతినిధులు, వివిధ వాణిజ్య, వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement