ఏసీబీ వలలో డిప్యూటీ డీఈఓ సీసీ

Camp Clerk Caught With Bribery Demand In Prakasam - Sakshi

ఒంగోలు క్రైం:  అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో ఒంగోలు డిప్యూటీ డీఈఓ కార్యాలయ క్యాంప్‌ క్లర్క్‌ (సీసీ)బి.జ్ఞానేశ్వరరావు శుక్రవారం చిక్కాడు. ఓ ప్రైవేటు స్కూల్‌కు ప్రొవిజనల్‌ రికగ్నైజేషన్‌ (పీఆర్‌) కోసం రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్‌ తన సిబ్బందితో కలిసి దాడి చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థానిక గంఠాపాలెంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న ఒంగోలు డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో జ్ఞానేశ్వరరావును పట్టుకున్నారు. వివరాలు.. ఒంగోలు నగరంలోని వెంకటేశ్వర కాలనీలో చండ్ర రాజేశ్వరరావు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో చైతన్య హైస్కూల్‌ను కరస్పాండెంట్‌ గుడిపూడి హరిబాబు నిర్వహిస్తున్నాడు. హరిబాబు 2017 నవంబర్‌ 23 నుంచి స్కూల్‌ నడుపుతున్నాడు. అప్పట్లో గుంటూరు ఆర్‌జెడీ ఇచ్చిన అనుమతితో పాఠశాల నడుస్తోంది. ఇదిలా ఉంటే జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ) నుంచి ప్రొవిజనల్‌ రికగ్నైజేషన్‌ పొందాల్సి ఉంది. అందుకు ఒంగోలు డిప్యూటీ డీఈఓ పాఠశాలను తనిఖీ చేసి నిబంధనల మేరకు అన్ని వసతులు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించాల్సి ఉంది. అందుకోసం హరిబాబు 2017 డిసెంబర్‌ 13న బ్యాంకులో చలానా కట్టాడు.

ఆ తర్వాత దరఖాస్తును డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో ఇచ్చాడు. దరఖాస్తు చేసి ఐదు నెలలు కావస్తున్నా «పక్కన పెట్టేశారు. చివరకు ఈ ఏడాది ఏప్రిల్‌ 4న వెంకటేశ్వర కాలనీలోని పాఠశాల వద్దకు డిప్యూటీ డీఈఓ, సీసీలు ఇద్దరూ వెళ్లి తనిఖీ చేశారు. నివేదిక రూపొందించారు. పదో తరగతి ఫలితాలు విడుదల కావటం, ఇక నుంచి విద్యార్థులకు టీసీలు ఇవ్వాల్సి ఉండటంతో హరిబాబు తరుచూ కార్యాలయానికి వెళ్లి కలుస్తూనే ఉన్నాడు. డీఈఓకు నివేదిక పంపాలంటే డిప్యూటీ డీఈఓ దయానందం, సీసీ జ్ఞానేశ్వరరావులు రూ.30 వేలు డిమాండ్‌ చేశారు. చివరకు రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కార్యాలయంలోనే ఉన్న జ్ఞానేశ్వరరావు ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం తనకు ఇవ్వాల్సిన రూ.5 వేలు ఇచ్చి ఫైలు తీసుకెళ్లమన్నాడు. డిప్యూటీ డీఈఓకి ఇవ్వాల్సిన డబ్బులు అతనికే ఇవ్వమని సూచన కూడా చేశాడు. ఇక చేసేదిలేక డబ్బులు ఇచ్చి ఫైలు తీసుకున్నాడు. అక్కడే మాటు వేసి ఉన్న డీఎస్పీ తోట ప్రభాకర్, సీఐ టీవీవీ ప్రతాప్‌ కుమార్, సిబ్బంది రెడ్‌ హ్యాండెడ్‌గా ఆయన్ను పట్టుకున్నారు. అక్కడి నుంచే డిప్యూటీ డీఈఓకు హరిబాబు ఫోన్‌ చేశాడు. ఫైల్‌ తీసుకున్నాను.. మీ డబ్బులు ఇస్తాను..అని పేర్కొన్నాడు. కోర్టు వద్ద ఉన్నాను రమ్మని చెప్పాడు. ముందు హరిబాబు ఆ తర్వాత ఏసీబీ అధికారులు కోర్టు వద్దకు వెళ్లారు. మరి ఏసీబీ దాడికి సంబంధించిన సమాచారం తెలుసుకున్నాడో ఏమో అక్కడ డిప్యూటీ డీఈఓ దయానందం లేడు. రెండు మూడు చోట్ల ప్రయత్నించినా అందుబాటులో లేకపోగా సెల్‌ఫోన్‌ సైతం స్విచ్‌ ఆఫ్‌ చేసేశాడు. జ్ఞానేశ్వరరావు మీద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం :తోట ప్రభాకర్, ఏసీబీ డీఎస్పీ
డిప్యూటీ డీఈఓ దయానందాన్ని కూడా పట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేశాం. ఒప్పందం ప్రకారం అతను రూ.10 వేలు తీసుకోవాల్సి ఉంది. అతనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. జ్ఞానేశ్వరరావు 2017 మే నెల 19వ తేదీ వరకు మద్దిపాడు హైస్కూల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఒంగోలు డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో సీసీగా డిప్యూటేషన్‌పై వచ్చాడు. హైస్కూల్‌ ప్రొవిజనల్‌ రికగ్నైజేషన్‌ కోసం లంచం డిమాండ్‌ చేయడంతో ఇష్టం లేని కరస్పాండెంట్‌ హరిబాబు ఈ నెల 8న మమ్మలను కలిశాడు. దీంతో వలపన్నాం. డిప్యూటీ డీఈఓ దయానందం మాత్రం తప్పించుకోగలిగాడు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top