మద్యం మత్తు.. ప్రాణం తీసింది | baby died with his fathers irresponsibility | Sakshi
Sakshi News home page

మద్యం మత్తు.. ప్రాణం తీసింది

May 4 2015 3:59 AM | Updated on Aug 21 2018 5:46 PM

మద్యం మత్తు.. ప్రాణం తీసింది - Sakshi

మద్యం మత్తు.. ప్రాణం తీసింది

లక్కిరెడ్డిపల్లె మండలంలోని బి.యర్రగుడి పంచాయతీ చెంచెర్లపల్లెకు చెందిన పూలుకుంట సుబ్బరాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం...

అచేతనంగా పడి ఉన్న ఈ చిన్నారి పేరు ప్రసన్న(4). అమ్మానాన్నలతో కలిసి గంగమ్మ జాత రకు వెళ్లింది. నాన్న ట్రాక్టర్ నడుపుతుంటే నాన్నా.. నీ పక్కన కూర్చుంటానంటూ వెళ్లి కూర్చుంది. ట్రాక్టర్ అటూ ఇటూ కదులుతుంటే ఉయ్యాల ఊగినట్లుందని సంబరపడింది. కానీ నాన్న మద్యం మత్తులో ఉన్నాడని.. ట్రాక్టర్ అదుపు తప్పుతోందని తెలుసుకోలేకపోయింది. క్షణాల్లో ట్రాక్టర్ పంటపొలాల్లోకి దూసుకెళ్లడంతో ఆ చిన్నారి ట్రాక్టర్ టైర్ల కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
 
లక్కిరెడ్డిపల్లె : లక్కిరెడ్డిపల్లె మండలంలోని బి.యర్రగుడి పంచాయతీ చెంచెర్లపల్లెకు చెందిన పూలుకుంట సుబ్బరాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం అనంతపురం గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరకు బయలుదేరాడు. అక్కడ మధ్యాహ్నం విందు భోజనం ఉండటంతో మద్యం సేవించాడు. మద్యం మత్తులోనే భార్యా, బిడ్డల్ని ట్రాక్టర్‌లో కూర్చోబెట్టుకున్నాడు. గద్దగుండ్లరాచపల్లె సమీపంలోని మలుపు వద్దకు చేరుకోగానే ట్రాక్టర్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.

రెండవ కుమార్తె అయిన ప్రసన్న(4) ట్రాక్టర్‌పై నుంచి కిందపడటంతో టైర్లు ఎక్కాయి. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆ దారిలో వెళ్లే ప్రయాణికులు వారి బంధువులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని తండ్రి సుబ్బరాయుడుకి దేహశుద్ధి చేశారు. ట్రాక్టర్‌లోనే ఉన్న భార్య లక్ష్మీదేవి, మొదటి కుమార్తెకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో వారి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు ఎంతగా చెబుతున్నా పట్టించుకోకపోవడంతో చివరకు తండ్రి చేసిన తప్పిదానికి  చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement