పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు

AP New districts are for administrative convenience only - Sakshi

ప్రతి 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఒక జిల్లా

మంత్రివర్గ సమావేశంలో సీఎం స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: ప్రతి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలో మార్పులకు అవకాశం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. కొన్ని ప్రాంతాల్లో జిల్లా కేంద్రానికి అసెంబ్లీ నియోజకవర్గాలు దూరమవుతాయని, అందువల్ల అలాంటి వాటి పరిధిని మార్చాలనే చర్చ వచ్చింది. ఈ సందర్భంగా సీఎం స్పష్టమైన విధానాన్ని వివరించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.  

► ‘ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పడితే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. అప్పుడే జిల్లాలు బాగుపడతాయి. కలెక్టర్లు బాగా పరిపాలన చేయగలుగుతారు. ఒక్కో జిల్లాలో 15, 17, 19 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఏ విధంగా న్యాయం చేయగలగుతాం?’ అని సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది.  
► అరకు లోక్‌సభ నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉందని, దాని పరిధిని ఒక జిల్లాగా నిర్ణయిస్తే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. ఈ విషయమై సీఎం స్పందిస్తూ.. ‘అంతగా అయితే అరకు లోక్‌సభా పరిధిని రెండు జిల్లాలుగా చేద్దాం.. అప్పుడు 25 జిల్లాలకు అదనంగా మరొకటి పెరిగితే పెరుగుతుంది.. మిగతా చోట్ల మార్పులకు అవకాశం లేదు’ అని చెప్పినట్లు సమాచారం.  
► కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లా కేంద్రానికి దూరమవుతాయని కొందరు అభిప్రాయపడగా, అలాంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి తన లాంటి వారికి అవకాశం ఇవ్వండని పేర్ని నాని అనడంతో.. ‘అంతే.. మరి’ అని ముఖ్యమంత్రి బదులిచ్చినట్లు తెలిసింది.  

వర్షాలు బాగా పడుతున్నాయ్‌.. 
► రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతుండటం పట్ల మంత్రివర్గ సమావేశంలో హర్షం వ్యక్తమైంది. ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ‘ఇదంతా మీ మహిమ సార్‌’ అని పినిపె విశ్వరూప్‌ అన్నట్లు తెలిసింది. వెంటనే కురసాల కన్నబాబు జోక్యం చేసుకుని ఇదే మాట తాను విలేకరుల సమావేశంలో చెబితే టీడీపీ వారు విమర్శలు చేశారని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. జగన్‌ పాలనలో వర్షాలు బాగా పడుతున్నాయని ప్రజల్లో మూఢ నమ్మకాలు కలిగిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని ఆయన వివరించగా, ముఖ్యమంత్రి మాత్రం నవ్వుతూ మౌనం దాల్చారని సమాచారం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top