శరవేగంగా అమరావతి – అనంతపురం హైవే పనులు

Amaravati Anantapur Highway Works Get Speedy - Sakshi

జిల్లాలో మేడికొండూరు, కావూరు, నూజెండ్లలో జంక్షన్‌ బాక్స్‌ల ఏర్పాటు 

నూజెండ్ల జంక్షన్‌ బాక్స్‌కు 158.67 ఎకరాల కేటాయింపు 

రైతుల్లో హర్షాతిరేకాలు  

సాక్షి, నూజెండ్ల(గుంటూరు) : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనున్న అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి ప్రణాళికలు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. ఇటీవల సీఎం వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పనుల కోసం రూ.100 కోట్లను బడ్జెట్‌లో కేటాయించడంతో ఒక్కసారిగా పనుల్లో కదలిక వచ్చింది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు దశల వారీగా సమీక్ష సమావేశాలు, హైవే నిర్మాణంలో అనుమానాలపై నివృత్తి చేస్తూ జంక్షన్‌ బాక్స్‌ల వివరాలు తెలియజేశారు. దీంతో ఇకపై నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యాల్లో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది. 

గత ప్రభుత్వ హయాంలో పనులు నత్తనడకన సాగడంతో రైతుల్లో అనుమానాలు తలెత్తాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండో సంతకమే అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో విషయం తెరమీదికి వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హైవే నిర్మాణంపై చర్చ జరుగుతోంది. 

ఎక్స్‌ప్రెస్‌ హైవే వెళ్లేది ఇలా...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అనంతపురం నుంచి తాడిపత్రి మీదుగా నంద్యాల, గిద్దలూరును కలుపుకుంటూ గుంటూరు వరకు రహదారిని రూ.25వేల కోట్లతో 557కిలో మీటర్ల మేర అధునాతన సాంకేతికతో ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం పేరిట గతంలో ఒప్పందాలు జరిగాయి. 2015 నుంచి నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. అయితే, ఎన్‌హెచ్‌ఏఐకి రోడ్డు నిర్మాణ పనులు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కేంద్రం ఆధ్వర్యంలోని సంస్థలు పనులు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. నిర్మాణాన్ని కేంద్రం చేపట్టినట్లయితే వివాదాలు లేకుండా రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే, కొంతకాలంగా స్తబ్ధతగా ఉన్న ఈ హైవే ప్రస్తావన తెరపైకి రావడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

150 ఎకరాల లోపే జంక్షన్‌ బాక్స్‌లు
సుదీర్ఘమైన అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంలో మూడు చోట్ల జంక్షన్‌ బాక్స్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే, గతంలో జంక్షన్‌ బాక్స్‌లకు 250 ఎకరాలకు పైగా భూములు సేకరించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రభుత్వం ప్రస్తుతం ఎనిమిది లైన్ల రహదారిని నాలుగు లైన్లకు కుదించింది. దీంతో పాటు నూజెండ్ల జంక్షన్‌ బాక్స్‌కు 158.67 ఎకరాలు, కావూరు 130 ఎకరాలు, మేడికొండూరు 128 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో వందలాది ఎకరాల సేకరణకు స్వస్తి పలుకుతూ 150 ఎకరాల లోపే జంక్షన్‌ బాక్స్‌లు కుదించడంతో రైతులు  హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం
సూర్యారావుపేట(విజయవాడ సెంట్రల్‌): రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని,అసెంబ్లీలో అద్భుతమైన బిల్లులు తీసుకువచ్చి సామాజిక న్యాయం కోసం బాటలు వేశారని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు డేరంగుల ఉదయకిరణ్‌ బుధవారం ఒక ప్రకటనలో కొనియాడారు. నిధుల్లో, నియామకాల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనారిటీలకు, మహిళలకు 50 శాతం కేటాయించిన తీరు ప్రశంసనీయమన్నారు. ప్రాథమిక విద్యతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. చంద్రబాబు హయాంలో చోటుచేసుకున్న అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని ఆయన అనుచరులు భయపడుతున్నారని, పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి విధానాలు దేశంలో ఎందరికో ఆదర్శనీయమని తెలిపారు.

చంద్రబాబునాయుడు కాపులకు, బీసీలకు మధ్య శత్రుత్వం సృష్టించి స్వార్థ రాజకీయాలకు  కాపులను మోసం చేసి పబ్బం గడుపుకొన్నారని ఎద్దేవా చేశారు. వడ్డెర, వాల్మీకి, బెస్త, రజక, కురుబ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చుతానని ఐదేళ్లు కాలయాపన చేసి  పంగనామాలు పెట్టిన చంద్రబాబుకు ప్రజా సమస్యలపై మాట్లాడే అర్హత లేదన్నారు.ఊసరవెల్లిలా రంగులు మార్చడం చంద్రబాబుకు అలవాటేనని, వడ్డెర కులానికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. బీసీలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో న్యాయం జరుగుతుండడంతో ఓర్వలేక చంద్రబాబు వారిపై కపట ప్రేమ చూసిస్తున్నారని పేర్కొన్నారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top