చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
భూదాన్‌పోచంపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. పోచంపల్లి మున్సి పాలిటీ పరిఽధిలోని ముక్తాపూర్‌కు చెందిన నోముల వెంకట్‌రెడ్డి(45) ఈ నెల 12న పని మీద బైక్‌పై పోచంపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ముక్తాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ఆటోను ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వచ్చిన మరో వాహనదారుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో వెంకట్‌రెడ్డి రోడ్డుపై పడిపోవడంతో అతడి తలకు తీవ్రగాయమై కోమాలోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడు బోర్‌వెల్ డ్రిల్లర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ఎంజీయూ హాస్టల్‌లో విద్యార్థుల ఆందోళన
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని హాస్టల్‌లో విద్యార్థులు ఉపయోగించే తాగు నీటి రిఫ్రిజిరేటర్‌లో శనివారం జెర్రి రావడంతో కలకలం రేగింది. యూనివర్సిటీలో ఇటీవల తరచుగా రిఫ్రిజిరేటర్‌లో కప్పలు, పురుగులు రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రిఫ్రిరేజిరేటర్ పాడైపోయినా దాన్ని మార్చకుండా ఉపయోగించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వసస్తోందని ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు. జెర్రి ఉన్న రిఫ్రిరేజిరేటర్‌ను అక్కడి నుంచి తీసుకుపోయి బయట పడేశారు. విద్యార్థులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో హాస్టర్ డైరెక్టర్ రమేష్ వారికి సర్దిచెప్పారు. కొత్త రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేసి విద్యార్థులకు నాణ్యమైన తాగునీరు అందించాలని ఏబీవీపీ ఎంజీయూ అధ్యక్షుడు హనుమాన్ డిమాండ్ చేశారు.
నేడు మఠంపల్లికి బిషప్
మఠంపల్లి : మండల కేంద్రంలోని శుభవార్త చర్చికి ఆదివారం నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి (బిషప్) డాక్టర్ దమన్‌కుమార్ రానున్నారు. ఈ సందర్భంగా స్థానిక రెవరెండ్ ఫాదర్ రాజారెడ్డి పోగుల విలేకరులతో మాట్లాడారు. బిషప్ శుభవార్త చర్చిని మేరీమాత పుణ్యక్షేత్రంగా ప్రకటించనున్నారని తెలిపారు. దాంతో ఏప్రిల్‌లో జరిగే చర్చి వార్శికోత్సవాల నుంచి ఈ చర్చి మేరీమాత పుణ్యక్షేత్రంగా వాడుకలోకి వస్తుందన్నారు. బిషప్ చర్చిలో దివ్యబలిపూజ చేసి క్రైస్తవులకు ఆధ్యాత్మిక ప్రసంగం చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఫాదర్ అశోక్, శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు జయభారత్‌రెడ్డి ఉన్నారు.


