ఉపాధి పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనుల్లో వేగం పెంచాలి

Jun 12 2026 12:23 AM | Updated on Jun 12 2026 12:23 AM

కొత్తకోట రూరల్‌: జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు వేగంగా, నాణ్యతగా చేపట్టాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం పెద్దమందడి మండలం జంగమాయపల్లి అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న కందకాల తవ్వకం పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతి, కార్మికుల హాజరు నమోదు, తవ్వకాలను చూసి కూలీలతో మాట్లాడి పని వేళలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశాల్లో కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు, నీడ తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు.

అనంతరం పామిరెడ్డిపల్లి–బలిజపల్లి రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు కార్మికుల సంఖ్య పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తరహా పనులు ఇతర మండలాల్లో కూడా చేపట్టాలని సూచించారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్‌, మండలస్థాయి అధికారులు ఉన్నారు.

ధ్యానం త్వరగా దించుకోవాలి..

వనపర్తి రూరల్‌: కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తీసుకొచ్చిన లారీలు గోదాముల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరగా దించుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు. గురువారం మండలంలోని చిట్యాల శివారులో ఉన్న లక్ష్మీనర్సింహ రైస్‌మిల్లు గోదామును ఆయన సందర్శించి అన్‌లోడింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. లారీలు ఎక్కువ సంఖ్యలో వేచి ఉంటే కొన్నింటిని ఇతర గోదాములకు తరలించాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారిని ఆదేశించారు. అవసరమైన హమాలీల సంఖ్య పెంచాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి, తదితర అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement