బాలకార్మిక వ్యవస్థను రూపుమాపుదాం | - | Sakshi
Sakshi News home page

బాలకార్మిక వ్యవస్థను రూపుమాపుదాం

Jun 12 2026 12:23 AM | Updated on Jun 12 2026 12:23 AM

వనపర్తి: బాలకార్మిక వ్యవస్థ సమాజానికి శాపమని.. ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, స్వేచ్ఛాయుత బాల్యం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ సునీతారెడ్డి కోరారు. అంతర్జాతీయ బాలకార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా రూరల్‌ డెవలప్‌మెంట్‌ స్వచ్ఛంద సేవాసంస్థ, మహిళా, శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. బాల కార్మికులను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి వారికి విద్యనందించేందుకు ప్రతి పౌరుడు సహకరించాలన్నారు. బాలకార్మిక రహిత సమాజ నిర్మాణమే నిజమైన అభివృద్ధికి నాంది అని.. పిల్లల చేతుల్లో పనిముట్లు కాకుండా పుస్తకాలు ఉండేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి సుధారాణి, జిల్లా రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్‌, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాంబాబు, సఖి కేంద్రం నిర్వాహకురాలు కవిత తదితరులు ఉన్నారు.

పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తాం..

పాన్‌గల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తించే రాందాస్‌ జనవరిలో బ్రెయిస్‌ స్ట్రోక్‌తో మృతిచెందాడు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన భార్య లావణ్యకు ఎస్పీ సునీతారెడ్డి పోలీసు విడో కార్పస్‌ ఫండ్‌ కింద రూ.లక్ష చెక్‌ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు పోలీసుశాఖ అన్ని విధాలుగా అండగా నిలుసుందన్నారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి అందాల్సిన అన్నిరకాల ప్రయోజనాలను సాధ్యమైనంత త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా లావణ్యతో మాట్లాడి కుటుంబ సభ్యుల స్థితిగతులు, పిల్లల చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్యాలయ ఏఓ సునందన, సూపరింటెండెంట్‌ ఇంతియాజ్‌ , రాందాస్‌ కుమార్తె నిఖిత తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement