వనపర్తి రూరల్: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు హెచ్చరించారు. గురువారం జిల్లాకేంద్రంలోని రాజారాం ఏజెన్సీస్, మన రైతుబజార్, రాఘవేంద్ర ఫర్టిలైజర్, మండలంలోని చిమనగుంటపల్లిలో ఉన్న వేంకటేశ్వర ట్రేడర్స్‌ను తహసీల్దార్ రమేష్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు ఇచ్చిన రసీదులు, నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తే తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ ద్వారా లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. వారి వెంట వ్యవసాయ అధికారి కురుమయ్య, పోలీసు సిబ్బంది ఉన్నారు.
2,972 మంది విద్యార్థులు పాస్
వనపర్తిటౌన్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 2,972 మంది ఉత్తీర్ణులయ్యారని డీఐఈఓ నరేంద్రకుమార్ గురువారం తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు 3,482 మంది విద్యార్థులు రాయగా 2,155 మంది పాస్ కావడంతో 61.88 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ఇందులో బాలురు 1,864 మందికిగాను 985 మంది.. బాలికల్లో 1,618 మందికిగాను 1,170 మంది పాసయ్యారని చెప్పారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలు 1,696 మంది విద్యార్థులు రాయగా 817 మంది విద్యార్థులు పాసై 48.17 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. ఇందులో బాలురు 1,112 మంది పరీక్షలు రాయగా 529, బాలికలు 584 మంది పరీక్షలు రాయగా 288 మంది పాసయ్యారని వివరించారు.


