మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరుకు చెందిన నర్సింహులు ఇంటి నిర్మాణం కోసం అప్పులు పెరిగిపోయి నిండా మునిగిపోవడం... అప్పుల వాళ్ల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం శివారులో తాను కౌలుకు తీసుకున్న మామిడి తోటలో తన ఇద్దరు పిల్లలతో సహా భార్య కాళ్లూ చేతులు కట్టేసి సంపులో పడేశాడు. ఈ సంఘటన గత నెల 27వ తేదీన చోటు చేసుకుంది.. అప్పుల బాధ తట్టుకోలేక ఇలా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నో కుటుంబాలకు శోకాన్ని మిగిలిస్తుంది.
మహబూబ్‌నగర్ క్రైం: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిలిస్తోంది..అంతకు మించి అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు.. నమ్ముకున్న వారు అనాథలుగా మారుతున్నారు.. పచ్చని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వస్తున్నాయి.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆత్మహత్య ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండటం.. ఈ సంఖ్య ఏటా పెరుగుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నిత్యం ఏదో ఒకచోట బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువ మంది మహిళలు చిన్నపాటి విషయానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబంలో వచ్చిన గొడవల కారణంగా భార్యాభర్తలు.. తల్లిదండ్రులు ఇలా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడంతో వందల సంఖ్యలో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తల్లి ఆత్మహత్య చేసుకున్నా.. తండ్రి బలవన్మరణానికి పాల్పడినా అనాథలుగా మారేది వారి పిల్లలే అన్న చిన్న విషయం గుర్తుకు వస్తే చాలా వరకు ఆత్మహత్యలు ఆలోచనలతోనే ఆగిపోతాయి. 2025 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 962 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అందులో అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలోనే 332 మంది ఉన్నారు. ఈ ఏడాది ఈ జిల్లాలో ఇప్పటికే 149 మంది ఆత్మహత్యలకు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
● ఆత్మహత్య చేసుకోవడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. తీవ్రమైన నిరసన తెలపడం.. అభద్రతాభావం.. తన బాధ వినేవారు ఎవరూ లేరు అనే బాధతో ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పుతుంది. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువగా నడివయస్కులవారే. తన మాట వినేవారు ఉన్నారు అని వారు భావిస్తే ఆత్మహత్య ఆలోచన రాకుండా ఉంటుంది.
● చదువుల్లో వెనుకబాటుతోపాటు ఆశించిన మార్కులు సాధించలేమనే కారణాలతో బలవన్మరణం చెందుతున్న విద్యార్థులెందరో ఉన్నారు. ప్రవేశ పరీక్షలలో విఫలమయ్యానని, పరీక్షల్లో అనుకున్న ర్యాంకు రాలేదని.. ఆ కళాశాలలో వాతావరణం బాగా లేదని.. లెక్చరర్స్ తిట్టారని.. ఇంట్లో అమ్మానాన్న మందలించారని.. ఫోన్ చూడొద్దంటున్నారని.. ప్రేమలో విఫలమయ్యామని.. ఇలా చిన్నపాటి కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 28 నుంచి 30 శాతం మంది చదువులో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విద్యార్థి దశలో 14– 20 ఏళ్లలోపు వారు ఎక్కువగా మరణిస్తున్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కలు బహిర్గతం చేసింది. ఈ తరహా ఆత్మహత్యలు జిల్లాలోనూ ఏడాదికి పదుల సంఖ్యలో ఉంటున్నాయి.
ఇవీ కారణాలు..
బలవన్మరణాలు పాల్పడుతున్నవారిలో 16 నుంచి 40 ఏళ్ల వారే అధికం
అనాథలుగా మారుతున్న పిల్లలు.. ఆగమవుతున్న బతుకులు
కుటుంబంలో వచ్చే విభేదాలే కారణంఅంటున్న నిపుణులు
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలతో ఆందోళన


