వనపర్తిటౌన్: ఇన్‌చార్జి జిల్లా విద్యాధికారిగా యాదయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డీఈఓ అబ్దుల్ ఘనీ ఈ నెల 1న వికారాబాద్‌కు బదిలీ కావడంతో ఆర్‌జేడీ కార్యాలయంలో ఏడీగా పని చేస్తున్న వెంకటేశ్వర్‌రెడ్డికి వనపర్తి డీఈఓగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. వెంకటేశ్వర్‌రెడ్డి బాధ్యతలు తీసుకోకపోవడం, మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి జెడ్పీ సీఈఓ యాదయ్యకు అదనంగా డీఈఓ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా డీఈఓ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు యాదయ్యను సన్మానించారు.
ఓటరు జాబితా సవరణకు సహకరించాలి
వనపర్తి రూరల్: ప్రభుత్వం అర్హులైన ఓటర్లందరినీ జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తోందని.. ప్రతి ఒక్కరూ పాల్గొని అధికారులకు సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పెబ్బేరు మండలంలోని రంగాపురం, పెబ్బేరు పురపాలికలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మొక్కలు నాటడంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని.. పర్యావరణ సమతుల్యతతో రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్ లభిస్తుందని వివరించారు. ప్రతి ఇంటా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీడీఓ వెంకటేష్, ఏఓ షేక్ మున్నా, ఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్, కమిషనర్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధిలో
భాగస్వాములు కావాలి
పాన్‌గల్: ప్రజలు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీఆర్డీఓ ఉమాదేవి కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో సర్పంచ్ ఉషా లింగానాయక్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. చెత్తను ఇష్టానుసారంగా కాలనీలో పారబోయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా చెత్త తరలింపు ట్రాక్టర్ వచ్చినప్పుడు వేయాలన్నారు. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రతి ఇంటా మరుగుదొడ్డితో పాటు ఇంకుడుగుంతను విధిగా నిర్మించుకోవాలని సూచించారు. ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలని.. ఎక్కువ మంది కూలీలు పనులకు హాజరుకావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. సమావేశంలో ఎంపీడీఓ గోవిందరావు, పంచాయతీ కార్యదర్శి కుర్మన్న, తండావాసులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
వనపర్తి: జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాం తనిఖీ చేసి సమగ్ర నివేదిక అందజేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆయన వెంట రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, సి–సెక్షన్ సిబ్బంది రాజేష్, కాంగ్రెస్ నుంచి వేణాచారి, సీపీఎం నుంచి పరమేశ్వరాచారి, బీజేపీ నుంచి కొమ్ము శ్రీనివాస్, పెద్దిరాజు, బీఆర్‌ఎస్ నుంచి జమీల్, ఎంఐఎం నుంచి అప్సర్, టీడీపీ నుంచి శంకర్ తదితరులు ఉన్నారు.


