మదనాపురం: మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు శాసీ్త్రయ పద్ధతులు అవలంబిస్తూ సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఖేతి బచావో అభియాన్.. షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళికపై రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ ప్రధానశాస్త్రవేత్త డా. ఆర్‌డీ ప్రసాద్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. సురేష్‌కుమార్, కేవీకే హెడ్ డా. వి.రాజేంద్రకుమార్ హాజరై జ్యోతి వెలిగించి సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. వి.రాజేంద్రకుమార్ మాట్లాడుతూ.. రైతులు ఆధునిక సాంకేతికతను అందుపుచ్చుకోవాలని సూచించారు. పంటల సంరక్షణ, సమగ్ర కీటక యాజమాన్య పద్ధతులు, నేల ఆరోగ్య పరిరక్షణతో పాటు సహజ వనరులను సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలో రైతులకు సమగ్రంగా వివరించారు. శాస్త్రవేత్తలు డా. ఆర్‌డీ ప్రసాద్, డా. సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. పంట మార్పిడీతో భూమి ఉత్పాదకత పెరుగుతుందన్నారు. ఆముదం, కుసుమ, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల పంటల్లో మెరుగైన రకాలను ఎంచుకోవాలని, విత్తనశుద్ధి, భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల యాజమాన్యం చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎస్‌సీఎస్‌పీ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాల రైతులకు ఉన్న వివిధ ప్రయోజనాలు, అవకాశాలను వివరించారు. వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు తిప్పస్వామి ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాయితీలు, విత్తనాల పంపిణీ, పంటల బీమా అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. అర్హులైన రైతులందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదస్సుకు హాజరైన రైతులకు ఆముదం, కంది, రాగులు, జొన్న విత్తనాలను శాస్త్ర వేత్తలు ఉచితంగా పంపిణీ చేశారు. తక్కువ పెట్టు బడి, వాతావరణ ఒడిదొడుకులను తట్టుకొని అధిక ఆదాయం ఇచ్చే పంటలు సాగు చేయడమే ముఖ్య ఉద్దేశమని శాస్త్రవేత్తలు తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఆర్.అనిత, డా. జి.భవాని, కేవీకే సిబ్బ ంది, పరిసర ప్రాంతాల రైతులు పాల్గొన్నారు.


