పంటమార్పిడితో అధిక లాభాలు | - | Sakshi
Sakshi News home page

పంటమార్పిడితో అధిక లాభాలు

Jun 11 2026 12:25 AM | Updated on Jun 11 2026 12:25 AM

గోపాల్‌పేట: రైతులు పంటమార్పిడి పద్ధతి అవలంబిస్తే అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని జయన్న తిర్మలాపూర్‌ నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇంకుడుగుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఇంటా విధిగా నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నామని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లాలో రెండ్రోజులు పర్యటించి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవడానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా ఐదు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మాట్లాడుతూ.. గ్రామంలో గత ఐదేళ్లలో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వారు మరణిస్తే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకొని రూ.20 వేలు పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తోందని.. ప్రతి ఒక్కరూ పాల్గొని అధికారులకు సహకరించాల ని కోరారు. గ్రామంలో రూ.పది లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జ్యోతిగోపాల్‌, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ముజాహిద్‌, నాయకుడు యాదయ్య, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement