గ్రామీణ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తాం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: గ్రామీణ క్రీడాకారులకు భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తామని భారత జట్టు మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు అన్నారు. జిల్లాకేంద్రం బోయపల్లి సమీపంలోని ఎండీసీఏ మైదానం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లా అండర్–14, 16 వన్ డే క్రికెట్ టోర్నీ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌సీఏ నుంచి భారత జట్టుకు అధిక సంఖ్యలో క్రీడాకారులను ఎంపిక చేసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. గ్రామీణ క్రీడాకారులు భారత జట్టుకు ఆడాలన్నదే హెచ్‌సీఏ లక్ష్యం అన్నారు. హెచ్‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్‌రెడ్డి మాట్లాడుతూ మొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ టీ–20 క్రికెట్ ప్రారంభం కానుందన్నారు. ప్రతి జట్టులో నలుగురు గ్రామీణ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో తెలంగాణ టీ–20 లీగ్ నుంచి రాష్ట్ర, జిల్లా క్రీడాకారులు భారత జట్టుతోపాటు ఐపీఎల్ తరపున ఆడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేసే కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామన్నారు. ఎండీసీఏ మైదానంలో ఫ్లడ్ లైట్లు, అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా క్రికెట్ టోర్నీ అండర్–14లో విజేతగా మహబూబ్‌నగర్, రన్నర్‌గా జడ్చర్ల, అండర్–16లో విజేతగా జడ్చర్ల, రన్నర్‌గా నిలిచిన మహబూబ్‌నగర్ బాలుర జట్లకు బహుమతులు ప్రదానం చేశారు.ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్, న్యాయవాది మనోహర్‌రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్, ప్రతినిధులు సురేష్‌కుమార్, వెంకటరామారావు, గోపాలకృష్ణ, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బాలాజీ ఐటీఐ కళాశాల మైదానంలో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇంట్రో డిస్ట్రిక్ అండర్–16 క్రికెట్ మ్యాచ్‌లో నారాయణపేట జట్టుపై వనపర్తి జట్టు విజయం సాధించింది. మంగళవారం వనపర్తి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 25 ఓవర్లలో 163 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన నారాయణపేట జట్టు 23 ఓవర్లు మాత్రమే ఆడి 99 పరుగులకే ఆలౌట్ అయింది. వనపర్తి జట్టులో పవన్ 52 బంతుల్లో 40 పరుగులు, మనోజ్ 28 బంతుల్లో 25 పరుగులు చేశారు. అదేవిధంగా బౌలింగ్‌లో 3 వికెట్లు తీసి వనపర్తి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మనోజ్‌కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలు ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. సమ్మర్ క్రికెట్ క్యాంపు ఇన్‌చార్జ్ రమణ, హెచ్‌సీఏ పరిశీలకుడు ముక్తార్, జహీర్, చెన్నారెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు.
జనరల్ ఆస్పత్రిలో భారీగా బదిలీలు
పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలోపాటు పాలమూరు మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న అన్నివిభాగాల హెచ్‌ఓడీలు హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. మొత్తం 9 విభాగాల ప్రొఫెసర్ల (హెచ్‌ఓడీ)లకు స్థానం చలనం కావడం విశేషం. మత్తు విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ మాధవి ఉస్మానియా, రేడియాలజీ విభాగం హెచ్‌ఓడీ హన్మంతు ప్రసాద్ గాంధీ ఆస్పత్రి, ఈఎన్‌టీ హెచ్‌ఓడీ డాక్టర్ శ్రీకాంత్ కోఠి, చిన్నపిల్లల విభాగం (పీడియాట్రిక్) హెచ్‌ఓడీ డాక్టర్ సురేష్ శ్రీనివాస్ నిలోఫర్, జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడీ డాక్టర్ అమరావతి ఉస్మానియా, ఎస్‌పీఎం హెచ్‌ఓడీ డాక్టర్ ఉషారాణి ఉస్మానియా, ఫిజియాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ సునందిని ఉస్మానియా, ఫోరెన్సిక్ హెచ్‌ఓడీ డాక్టర్ పార్వతి ఉస్మానియా, మైక్రోబయాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ రమాదేవి నిలోఫర్‌కు బదిలీ అయ్యారు. అదేవిధంగా జనరల్ ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీపద్మప్రియ నారాయణపేట, జనరల్ మెడిసిన్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ స్వప్న ఉస్మానియాకు, జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బాల శ్రీనివాస్ నాగర్‌కర్నూల్‌కు బదిలీ అయ్యారు. ఇక జిల్లాకు వచ్చిన వారిలో ఎస్‌పీఎం హెచ్‌ఓడీగా డాక్టర్ కోటేశ్వరమ్మ గాంధీ నుంచి బదిలీపై వచ్చారు. మైక్రోబయాలజీ హెచ్‌ఓడీగా డాక్టర్ శ్రీవాణి, జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడీగా డాక్టర్ శకుంతల రావడం జరిగింది.
కొత్తవారు ఎప్పుడో..?
జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాలలోని ఆయా విభాగాల్లో పనిచేసే హెచ్‌ఓడీలు (ప్రొఫెసర్లు) బదిలీ కావడంతో సదరు పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఖాళీ అయిన పోస్టుల్లో కొత్తవారు వచ్చి విధుల్లో చేరే వరకు ఎన్ని రోజులు పడుతుందనే విషయం తెలియడం లేదు. సాధారణంగా హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యి వచ్చే వారిలో ఇక్కడ విధుల్లో చేరడానికి ఆసక్తి చూపారు. ఒకవేళ చేరిన నిత్యం హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో స్థానికంగా వారు అందుబాటులో ఉండే అవకాశం లేదు.
డీఎంహెచ్‌ఓ కృష్ణ బదిలీ
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బదిలీ చేయడం జరిగింది. అలాగే డీఎంహెచ్‌ఓగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న కృష్ణ నాగర్‌కర్నూల్ డీఎంహెచ్‌ఓగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో జిల్లాకు ఇంకా ఎవరిని కేటాయించలేదు. అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిగా డాక్టర్ సునీతరెడ్డి వికారాబాద్ నుంచి బదిలీపై వచ్చారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ)గా డాక్టర్ శైలజ నారాయణపేట నుంచి బదిలీపై వచ్చారు. ఇక పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, ఫార్మాసిస్ట్‌లు, 24 మంది ఏఎన్‌ఎంలు, ముగ్గురు ఎంపీహెచ్‌ఓలు, నలుగురు హెల్త్ ఎడ్యుకేటర్లు, సూపర్‌వైజర్లు, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీహెచ్‌ఓలు బదిలీ కావడం జరిగింది. కిందిస్థాయి సిబ్బందికి జిల్లాలోని ఆయా పీహెచ్‌సీలు, మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిలో పోస్టింగ్ ఇవ్వగా.. కొందరు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు.
రోగులకు దిక్కెవరు..?
ప్రస్తుతం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్‌లు, అసిస్టెంట్‌లకు బదిలీ అయిన నేపథ్యంలో కొత్త వారు వచ్చి విధుల్లో చేరడానికి ఇంకా సమయం పట్టనుంది. అలాగే కొంతమందిని ఇక్కడికి బదిలీ చేసిన విధుల్లో చేరడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో జనరల్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు అవస్థలు తప్పవు. అందరూ విధుల్లో ఉన్న రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడేవారు ప్రస్తుతం అందరూ బదిలీ హడావుడిలో ఉండటంతో రోగులను పట్టించుకునే నాథుడే ఉండరు. దీంతో అడ్మిట్ అయిన రోగులతోపాటు అవుట్ పేషెంట్లకు మెరుగైన చికిత్స అందడం కష్టసాధ్యమే అనిపిస్తోంది.
9 విభాగాల హెచ్‌ఓడీలు, అసోసియేట్‌లకు స్థానచలనం
డీఎంహెచ్‌ఓ కృష్ణ నాగర్‌కర్నూల్‌కు..
ఆరోగ్యశాఖలో వైద్యాధికారులు,ఏఎన్‌ఎంలు అందరూ బదిలీ
జనరల్ ఆస్పత్రిలో కొత్త వైద్యులు విధుల్లో చేరే వరకు రోగులకు తప్పని అవస్థలు


