ఉపాధి రంగాలను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి రంగాలను ప్రోత్సహించాలి

Jun 10 2026 12:19 AM | Updated on Jun 10 2026 12:19 AM

రూ.5,990 కోట్ల వార్షిక

రుణ ప్రణాళిక పుస్తకం విడుదల

రుణాల మంజూరులో లక్ష్యాలను అధిగమించిన అధికారులకుకలెక్టర్‌ అభినందన

వనపర్తి: రైతులు, విద్యార్థులు, ఎంఎస్‌ఎంఈ యూనిట్లు, మెప్మా సంఘాలు, స్వయం ఉపాధి రంగాల రుణాల మంజూరులో బ్యాంకులు మరింత చొరవ చూపాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందరింలో కలెక్టర్‌ అధ్యక్షతన డీసీసీ (డిస్ట్రిక్ట్‌ కన్సల్టేటివ్‌ కమిటీ), డీఎల్‌ఆర్‌సీ (డిస్ట్రిక్ట్‌ లెవల్‌ రివ్యూ కమిటీ) సమావేశం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, ఎంఎస్‌ఎంఈ, విద్య, స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ పథకాల రుణాల మంజూరు వారీగా సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5,990 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని కలెక్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

రుణాల మంజూరులో సిబిల్‌ స్కోర్‌ను ప్రమాణంగా పరిగణించినప్పటికీ, అర్హులైన రైతులు, విద్యార్థులు, స్వయం ఉపాధి లబ్ధిదారుల రుణాలు తిరస్కరణకు గురికాకుండా సానుకూల దక్పథంతో వ్యవహరించాలన్నారు. కొన్ని బ్యాంకులు వివిధ ప్రభుత్వ పథకాల కింద రుణాల మంజూరులో వెనుకబడి ఉన్నాయని, తమ పనితీరు మెరుగుపర్చుకొని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి ముద్ర యోజన తదితర ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు నిర్ణీత గడువులోగా రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని బ్యాంకర్లను కోరారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పీఎం స్వనిధి, పీఎం విశ్వకర్మ పథకాలను సమీక్షించిన కలెక్టర్‌ లబ్ధిదారులకు రుణాల మంజూరులో ఆలస్యం కాకుండా కారణాలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. బ్యాంకులు, జిల్లా పరిశ్రమలశాఖ అధికారులు సమన్వయంతో లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఖాతాదారులు, ప్రభుత్వ పథకాల కింద రుణాలు తీసుకున్న లబ్ధిదారుకు బీమా పథకాలు వర్తింపజేయాలని సూచించారు. అవసరమైన విద్యార్థులకు విదేశీ విద్య, ఉన్నత విద్యా రుణాలు మంజూరు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేసిన యూబీఐ, ఎస్‌బీఐ, యూకో బ్యాంక్‌ ప్రతినిధులను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికలు అందజేశారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలోని కోర్సుల గోడపత్రికను ఆవిష్కరించారు.

అనంతరం డిస్ట్రిక్ట్‌ లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శివకుమార్‌ మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,339 కోట్ల వార్షిక రుణ లక్ష్యాలకుగాను రూ.4,943 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. నాబార్డ్‌ డీడీఎం మాట్లాడుతూ.. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రణాళిక రూపొందించడానికి కావాల్సిన సమాచారాన్ని అందించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, ఆర్బీఐ ఎల్‌డీఓ డా. ప్రదీప్‌చంద్ర, నాబార్డ్‌ డీడీఎం మనోహర్‌రెడ్డి, యూబీఐ ఏజీఎం మురళీకృష్ణ, ఎస్‌బీఐ ఆర్‌ఎం శ్రీచరణ్‌, ఇతర బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement