రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీ

Jun 10 2026 12:19 AM | Updated on Jun 10 2026 12:19 AM

రూ.2.50 కోట్ల వరి ధాన్యం

పక్కదారి పట్టినట్లు గుర్తింపు

కొత్తకోట: మండలంలోని మిరాసిపల్లి శివారులో ఉన్న సాంబశివ ఆగ్రో ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్లులో మంగళవారం రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ బృందం, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 25,426 బస్తాల సీఎంఆర్‌ ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.2.50 కోట్లు ఉంటుందని అధికారులు వేశారు. పంచనామా నిర్వహించి మిల్లులో ఉన్న మిగులు ధాన్యాన్ని రాయిణిపేట శివారులోని ఏకేఆర్‌ ఇండస్ట్రీస్‌కు తరలించారు. పూర్తి నివేదికను అదనపు కలెక్టర్‌ (పౌరసరఫరాలు) సమర్పిస్తామని.. తదుపరి ఆదేశాల మేరకు సంబంధిత మిల్లర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

ఫిజికల్‌ పత్రాలు అడగొద్దు : ఈడీఎం

వనపర్తి: మీ సేవా దరఖాస్తుల పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లో ఫిజికల్‌ పత్రాలు అడగొద్దని.. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వాటిని మాత్రమే పరిశీలించి మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని ఈడీఎం వెంకటేశ్‌ సూచించారు. మంగళవారం ఆయన అమరచింత, ఆత్మకూర్‌, మదనాపురం, కొత్తకోటలో పర్యటించి తహసీల్దార్లు, జీపీఓలు, ఆర్‌ఐలతో కలిసి మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ సేవా కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తులకు సంబంధించి అవసరమైన పత్రాలను సక్రమంగా స్కాన్‌ చేసి మండల సిబ్బందికి సమయానుకూలంగా అందజేయాలని ఆదేశించారు.

25 మంది డీటీలకు పదోన్నతులు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 25 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం సీసీఎల్‌ఏ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేస్తూ జిల్లాలకు కేటాయించారు. ఇందులో నాగర్‌కర్నూల్‌ జిల్లాకు రాజీవ్‌రెడ్డి, రామకృష్ణ, రవి, పుష్పలత, మహబూబ్‌నగర్‌ జిల్లాకు సుజాతమ్మ, హరిందర్‌రెడ్డి, శ్రీను, సుదర్శన్‌రెడ్డి, బాలరాజు, నారాయణపేట జిల్లాకు గాయత్రి, రాజ్‌గోపాల్‌, కిషోర్‌కుమార్‌, దీపిక, వియోచన, వనపర్తి జిల్లాకు వెంకటేశ్‌, వేణుగోపాల్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, కరుణాకర్‌, నదీమ్‌, గద్వాల జిల్లాకు రాఘవేందర్‌, తిలక్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌, శ్రీనివాస్‌, వాసుదేవరావులను కేటాయించారు. వీరికి ఆయా జిల్లాలోని మండలాలను కలెక్టర్లు కేటాయిస్తారు. అయితే మహబూబ్‌నగర్‌లో చాలామంది డీటీలు ప్రమోషన్‌ను తీసుకోవడానికి ఇష్టంగా లేరని సమాచారం. మహబూబ్‌నగర్‌ను విడిచి ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement