రేపటి ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

రేపటి ప్రజావాణి రద్దు

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

వనపర్తి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8న గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం జరిగే ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక గ్రామసభల కార్యక్రమం కారణంగా కలెక్టరేట్‌, ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి.. ఫిర్యాదులు, అర్జీలు ఇచ్చేందుకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. 15వ తేదీన యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

సమాన పనికి

సమాన వేతనం ఇవ్వాలి

కొత్తకోట: తెలంగాణ విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పవర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.రవికాంత్‌రెడ్డి, కార్యదర్శి మన్నె శశికుమార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం కొత్తకోటలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఎస్‌పీఎం కార్మికుల సర్వసభ్య సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. ఎస్‌పీఎం కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ యూనియన్‌ ముందుండి పోరాడుతోందన్నారు. ఎస్‌పీఎం కార్మికులందరినీ బేషరతుగా సంస్థలో విలీనం చేయడంతో పాటు విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్‌ డబ్బులు సక్రమంగా అందించాలని డిమాండ్‌ చేశారు. ఎం.బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీజీఎన్‌డీసీఎల్‌ అధ్యక్ష, కార్యదర్శులు రాందాస్‌ నాయక్‌, రమణారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎద్దుల సత్యం, ఎస్‌పీఎం కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కోశాధికారి ఇల్లందుల రాజయ్య, వరదరాజు, మురళీధర్‌రావు, సాయి ప్రకాశ్‌గౌడ్‌, కవికుమార్‌రెడ్డి, కురుమూర్తి, సురేంద్ర ప్రసాద్‌, కొండయ్య ఉన్నారు.

జలదోపిడీపై

విచారణ జరపాలి

వనపర్తి రూరల్‌: పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ శివారులోని లిక్కర్‌ కంపెనీ జలదోపిడీపై సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ పొలిటికల్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ రాచాల యుగేంధర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం లిక్కర్‌ కంపెనీ సమీపంలోని కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఏబీడీ లిక్కర్‌ కంపెనీ నిర్వాహకులు కృష్ణాజలాలను అక్రమంగా వినియోగించడంతో పాటు కంపెనీ నుంచి వెలువడే వ్యర్థాలను పైపుల ద్వారా నదిలో కలుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిబంధనల ప్రకారం నదీ జలాలను మొదటగా తాగడానికి, సాగుకు వాడుకోవాలని.. ఆ తర్వాతే ఇతర అవసరాలకు ప్రభుత్వ అనుమతులతో వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. లిక్కర్‌ కంపెనీ జలదోపిడీ చేస్తున్నా ఇరిగేషన్‌శాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించి.. కృష్ణాజలాల అక్రమ వినియోగంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేందర్‌ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి వీవీ గౌడ్‌, దేవర శివ, జితేందర్‌, రామన్‌గౌడ్‌, బీచుపల్లి సర్పంచ్‌ బీసీ రెడ్డి, ఉపసర్పంచ్‌ నాగరాజు, అదామ్‌, రాజశేఖర్‌గౌడ్‌, వీరేష్‌, నరేష్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ఆరుగురు ఆర్టీసీ డిపో మేనేజర్ల బదిలీ

నారాయణపేట రూరల్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరుగురు ఆర్టీసీ డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ సంస్థ చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట డీఎం టి.లావణ్య హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ డిపో–1కు బదిలీ కాగా.. ఆమె స్థానంలో హెడ్‌ఆఫీస్‌లోని ఏటీఎం కార్గో ఇన్‌చార్జి డీఎన్‌ రాజన్‌ను కేటాయించారు. అలాగే షాద్‌నగర్‌ డీఎం ఉషను జనగాంకు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో హైదరాబాద్‌ డిపో–2 నుంచి కరుణశ్రీ రానున్నారు. అచ్చంపేట డీఎం పీఎండీ ప్రసాద్‌ హయత్‌నగర్‌ డిపో–2కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో డిప్యూటీ ఈ–ఎలక్ట్రికల్‌ హెచ్‌ఆర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ను కేటాయించారు. గద్వాల డీఎం సునీతను కూకట్‌పల్లి డిపోకు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో రాణిగంజ్‌ డిపో నుంచి శ్రీధర్‌ వస్తున్నారు. కొల్లాపూర్‌ డిపో మేనేజర్‌ ఉమాశంకర్‌గౌడ్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయగా.. ఆయన స్థానంలో వరంగల్‌ బస్టాండ్‌ ఏటిఎంగా విధులు నిర్వహిస్తున్న మల్లేశ్వరయ్యను కేటాయించారు. కల్వకుర్తి డీఎం సుహాసినిని ఇల్లందు డిపోకు కేటాయించగా.. ఆమె స్థానంలో ఎవరినీ నియమించలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement