వనపర్తి: జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ భూసేకరణ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ కె.శివకుమార్‌నాయుడు ఆదేశించారు. ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులతో ఆయన సమావేశమై భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించి, నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టులను పూర్తిచేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలోని గణపసముద్రం ప్రాజెక్టులో పెండింగ్ ఉన్న 197 ఎకరాల భూసేకరణకు గాను 164 ఎకరాలకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. రైతులను ఒప్పించి అవార్డు కూడా త్వరగా జారీచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే విధంగా కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 17 ఎకరాల భూసేకరణకు సోమవారంలోగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఎంజీకేఎల్‌ఐ ప్యాకేజీ–29 మైనర్ కెనాల్స్‌కు సంబంధించి 77 ఎకరాల భూసేకరణకు పెగ్ మార్కింగ్ త్వరగా పూర్తిచేసి.. ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. ఘణపూర్ బ్రాంచ్ కెనాల్‌కు 30 ఎకరాల భూమి పెగ్ మార్కింగ్ పూర్తిచేయడంతో పాటు ఎస్‌డీఆర్ స్టేజీలో ఉన్న 60 ఎకరాలకు కూడా త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. బుద్ధారం పెద్ద చెరువుకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసిన 101 ఎకరాల భూమికి సంబంధించిన రైతులతో మాట్లాడి అవార్డు వేగంగా జారీచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఖాన్ చెరువుకు సంబంధించి చందాపూర్, సవాయిగూడెం, పెద్దగూడెం గ్రామాల పరిధిలో అటవీ భూమి అంశంపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని త్వరగా అనుమతులు పొందే విధంగా చూసుకోవాలన్నారు. భూ సేకరణలో భాగంగా ఇప్పటికే అవార్డ్స్ జారీ చేసిన వాటికి సంబంధించి టొకెన్స్ రైస్‌చేస్తే త్వరగా నగదు బదిలీ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ రహీముద్దీన్, ఎస్‌ఈ చంద్రశేఖర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, సర్వే ఏడీ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
పెండింగ్ పనులపై ప్రభుత్వం
ప్రత్యేక దృష్టి
నిర్ణీత గడువులోగా ప్రాజెక్టుల పూర్తికి చర్యలు
తెలంగాణ ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు


