అమరచింత/ఆత్మకూర్: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులు అన్నారు. శనివారం అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో హకా సెంటర్లు, ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అమరచింత మండలంలోని కిష్టంపల్లి హకా సెంటర్ –3, ఈర్లదిన్నెలోని వెంకటేశ్వర ట్రేడర్స్‌లో స్టాక్ వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా విత్తనాల స్టాక్ వివరాలను నోటీస్ బోర్డుపై లిఖించకపోవడంతో సదరు డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు, క్రిమిసంహారక మందులను మాత్రమే విక్రయించాలని సూచించారు. కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా విత్తనాలు కొనుగోలుచేసే రైతులు తప్పనిసరిగా రశీదులు పొందాలని ఆయన సూచించారు. డీఏఓ వెంట ఏఓలు రమేశ్, అరవింద్ ఉన్నారు.


