ఖిల్లాఘనపురం: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావస్తున్నందున మిల్లులు, గోదాముల దగ్గర అన్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కొత్తపల్లి తండా దగ్గర ఉన్న ఇన్‌వెస్టర్ గోదాం, మండల కేంద్రం సమీపంలోని శ్రీరామ రైస్‌మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోదాములు, రైస్‌మిల్లుల దగ్గర ధాన్యం తీసుకొచ్చిన లారీలు, డీసీఎంలు రోజుల తరబడి నిలిచిపోతున్నాయని.. హమాలీల సంఖ్య పెంచి త్వరగా అన్‌లోడింగ్ చేయించాలని చెప్పారు. ఆలస్యం కావడంతో చాలా సమస్యలు వస్తున్నాయని.. రోజుల తరబడి ఉండటంతో తూకంలో తేడాలు వస్తున్నట్లు పలు గ్రామాల రైతులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు వివరించారు. మిల్లులో కేవలం సన్నరకం మాత్రమే కాకుండా దొడ్డురకం వరి ధాన్యం కూడా దించుకోవాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున మండలస్థాయి అధికారులు తరుచూ మిల్లుల దగ్గరకు వెళ్లి పరిశీలించి కొనుగోళ్లు, అన్‌లోడింగ్ త్వరగా పూర్తి చేసేందుకు సూచనలు చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సుగుణ, డీటీ పరమేశ్వర్ తదితరులు ఉన్నారు.


