వనపర్తిటౌన్: ప్రచారం, హంగుల కోసం కాకుండా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమత్యులత కోసం మొక్కలు నాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రమాకాంత్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని జిల్లా న్యాయస్థానం ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు నాటి చేతులు దులుపుకొంటే కుదరదని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని చెప్పారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ప్రకృతిని అందించాలంటే పర్యావరణాన్ని నాశనం చేయొద్దన్నారు. గాలి, నీరు, నేల కాలుష్యమై ఉష్ణోగ్రతల్లో సమతుల్యత కొరవడటానికి అధిక వాహనాల వినియోగం, ప్లాస్టిక్ వాడకమని.. వినియోగాన్ని తగ్గించి మొక్కలు నాటితే పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతుందని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కళార్చన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు 500 నుంచి వెయ్యి సంవత్సరాలు పడుతుందని, భవిష్యత్‌లో ప్లాస్టిక్ భూతం మానవాళికి ఎంతో హాని కలిగిస్తుందన్నారు. వాతావరణ మార్పులను అడ్డుకోవడం, గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడం, ప్రకృతి సమతుల్యతను కాపాడటం భవిష్యత్ తరాలకు ఇచ్చే కోట్ల ఆస్తి అని వివరించారు. రాబోవు తరాలకు ఆరోగ్యకర, సురక్షిత, నివాసయోగ్యమైన భూమి అందించాలంటే ప్రస్తుతం మనం నాశనం చేయకుండా ఉంటే చాలని కోరారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కవిత, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు శ్రీలత, అశ్విని, కార్తీక్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, కార్యదర్శి వెంకటరమణ, అటవీశాఖ అధికారులు విజయ్, రాజుకుమార్, బాలకిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు.


