నేడు జడ్చర్లలో బహిరంగ సభ..
● కర్ణాటక మంత్రితో కలిసి రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థల పరిశీలన
● కొడంగల్–నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల ప్రగతిపై ఆరా
● ఏరియల్ వ్యూ ద్వారా కోయిల్‌సాగర్, జూరాల డ్యామ్ వీక్షణ
● గుడ్డెందొడ్డి పంప్ హౌస్ సందర్శన..
ఆ తర్వాత సోమశిలలో
ఉన్నతాధికారులతో సమీక్ష
● నేడు పీఆర్‌ఎల్‌ఐ, కేఎల్‌ఐ పనుల పరిశీలన.. జడ్చర్ల శివారులో
బహిరంగసభ
● పలు చోట్ల బీఆర్‌ఎస్, బీజేపీ
నాయకుల గృహనిర్బంధం
పాలమూరులో తొలి రోజు ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన తొలి రోజు గురువారం వడివడిగా సాగింది. కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి ఆయన ప్రత్యేక హెలీకాప్టర్‌లో బెంగళూరు నుంచి బయలుదేరి ముందుగా నారాయణపేట జిల్లా మక్తల్‌కు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు బేగంపేట నుంచి మరో హెలీకాప్టర్‌లో, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తమ వాహనాల్లో వచ్చారు. ఆ తర్వాత వారు రోడ్డు మార్గాన మక్తల్ మండలం కాట్రేవులపల్లికి చేరుకుని కొడంగల్ – నారాయణపేట – మక్తల్ ఎత్తిపోతల పథకం పనులపై ఆరా తీశారు. తిరిగి మక్తల్‌కు వెళ్లి కోయిల్‌సాగర్‌తో పాటు కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థలం, గద్వాల జిల్లా పరిధిలోని జూరాల డ్యామ్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ధరూర్ మండలంలో నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లో భాగమైన గూడెందొడ్డి రిజర్వాయర్‌కు చేరుకున్నారు. అక్కడ పంప్ హౌస్ పనులపై ఆరా తీశారు. ఆ తర్వాత హెలీకాప్టర్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని మృగవాణి రిసార్ట్‌కు చేరుకున్నారు. విరామం అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్ట్‌లపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, మేఘారెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీ చౌహాన్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గురువారం ప్రాజెక్ట్‌ల సందర్శనకు వచ్చిన సీఎం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం మృగవాణి రిసార్ట్‌లో బస చేశారు. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు, ఎంజీకేఎల్‌ఐలో భాగమైన ఎల్లూరు, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్‌లలో ఆయా చోట్ల నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లు, పంప్ హౌస్‌లలో పలు ప్యాకేజీల పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ రోడ్‌లో ఉన్న మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.


