పాన్‌గల్: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్ధేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని డీఆర్డీఓ ఉమాదేవి కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండలంలోని శాగాపూర్‌తండాలో సర్పంచ్ నాగేష్‌నాయక్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభకు ఆమె హాజరై మాట్లాడారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరు కావాలని, ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు పెంచి సంరక్షించాలన్నారు. ఇంటి, కొళాయి పన్ను చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ గోవిందరావు, వివిధ శాఖల అధికారులు, వార్డు సభ్యులు, తండా వాసులు పాల్గొన్నారు.


