గోపాల్‌పేట: మండలంలోని బుద్దారం లక్ష్మీతండాకు చెందిన ముడావత్ రవినాయక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తిచేసి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ నెల 2న ఢిల్లీలో జన జాతీయ గరిమా ఉత్సవ్ వేడుకల్లో భాగంగా భారత గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా గిరిజన్ స్కాలర్‌షిప్ పొంది పీహెచ్‌డీ పూర్తిచేసిన 200 మందిని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సన్మానించి అభినందించారు. ఇందులో ముడావత్ రవినాయక్ కూడా ఉన్నారు. ప్రస్తుతం రవినాయక్ ఏపీలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
నేటి నుంచి ‘పది’
సప్లిమెంటరీ పరీక్షలు
వనపర్తిటౌన్: జిల్లాలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఏసీజీఈ గణేష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లాకేంద్రంలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 11 వరకు పరీక్షలు కొనసాగుతాయని.. జిల్లావ్యాప్తంగా ఒకేఒక్క పరీక్ష కేంద్రం చాణక్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 204 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. మొదటిరోజు శుక్రవారం తెలుగు పరీక్ష 40 మంది విద్యార్థులు రాయనున్నారని, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష కొనసాగనుందని వివరించారు.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలుచేయాలి
వనపర్తి రూరల్: చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతోనే మహిళా సాధికారిత సాధ్యమని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ 72వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై సంఘం జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో కేవలం 33 శాతం రిజర్వేషన్ చట్టం చేశారని, బీజేపీ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో కలిపి పార్లమెంట్‌లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి అమలు కాకుండా అడ్డుపడిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును విడిగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. మహిళలు వంటింటి కుందేళ్లుగా మారొద్దని, అన్యాయం జరిగినప్పుడు వీధులోకి వచ్చి పోరాడినప్పుడే హక్కులు దక్కుతుండటంతో పాటు న్యాయం కూడా జరుగుతుందన్నారు. మహిళలు ఏకమై పోరాటాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి గీత, శిరీష, శ్రీదేవి, వెంకటమ్మ, సాయిలీల, నాగమణి, వార్డుసభ్యురాలు సుజాత, శాన్వి, బబ్బి, లావణ్య పాల్గొన్నారు.
పెంచిన వేతనాలు
వర్తింజేయాలి
ఖిల్లాఘనపురం: ఆస్పత్రి కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను వర్తింపజేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను వెంటనే రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రెండు నెలల జీతాలు విడుదల చేయాలని, ముఖ్యమంత్రి 73 షెడ్యూల్ రంగాల్లోని 11 వేల మంది కార్మికులకు కనీస వేతనం అందించాలని డిమాండ్ చేశారు. కనీస వేతన మండలి సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటే కార్మికులకు రూ.20 వేల కనీస వేతనం వచ్చేదన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


