కొత్తకోట రూరల్: మంగంపల్లిని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రజాపాలనా.. ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం జరిగిన ప్రత్యేక గ్రామసభకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలస్థాయి అధికారులు రోడ్డు భద్రత, బాల్యవివాహాల నిర్మూలన, ఇంకుడు గుంతల నిర్మాణం, పరిసరాల పరిశుభ్రత, వన మహోత్సవం, జల సంరక్షణ, పాఠశాలల్లో సౌకర్యాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి మెప్పు పొందుతుందని తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలోని మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.30 కోట్లు చెల్లించిందన్నారు. విద్యారంగానికి పెద్దపీట వేసి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తుందని.. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మంగంపల్లిని పైలట్ గ్రామంగా ఎంపిక చేశామని.. ఒక్క పూరి గుడిసె కూడా లేకుండా పక్కా ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ భవనాలతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు తనవంతుగా రూ.10 లక్షలు కేటాయిస్తానని, జిల్లా కలెక్టర్ ద్వారా మరో రూ.10 లక్షల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎస్‌ఆర్ నిధులతో గ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ ఏర్పాటుకు కృషి చేస్తానని, గ్రామంలో ఇప్పటికే సీసీ కెమెరాలు బిగించినట్లు చెప్పారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ప్రత్యేక గ్రామసభలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరూ ఇంకుడు గుంతలు నిర్మించుకుంటామని తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు. ఇంకుడు గుంతలతో గ్రామంలో భూగర్భ జలమట్టం పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఐదేళ్ల వ్యవధిలో 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వ్యక్తులు ఎవరైనా మరణిస్తే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా దరఖాస్తు చేసుకొని రూ.20 వేల లబ్ధి పొందవచ్చన్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తుందని.. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని సూచించారు. అనంతరం ముఖ్యఅతిథులు ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఎంపీడీఓ పరిణత, ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి, వార్డు సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


