● స్థానిక సంస్థల అదనపు
కలెక్టర్ ఖీమ్యానాయక్
ఖిల్లాఘనపురం: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సవరణపై ఎలాంటి అపోహలు వద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. మండలంలోని పర్వతాపురం, అల్లమాయపల్లి, తిర్మలాయపల్లి, అంతాయపల్లి, దొంతికుంటతండాలో గురువారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. పర్వతాపురంలో నిర్వహించిన గ్రామసభకు అదనపు కలెక్టర్‌తో పాటు డీఎల్‌పీఓ రఘునాథ్‌రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో చేపట్టే ఓటరు జాబితా సవరణలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉంటుందని, ఎలాంటి అపోహలకు తావివ్వకుండా అధికారులకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, ఉచితంగా పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫాం, నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. సాగులో ప్రభుత్వం గుర్తించిన వరి, పత్తి తదితర పంటల విత్తనాలు మాత్రమే కొనుగోలు, ఈ ఏడాది రైతులు ఆరుతడి పంటల సాగు పెంచాలన్నారు. జాతీయ కుటుంబ సహాయ పథకానికి అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జల సంరక్షణ.. మన సంరక్షణ పథకంలో భాగంగా ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత తవ్వుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయసింహారెడ్డి, మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, ఎస్సై వెంకటేష్, హౌసింగ్ ఏఈ సందీప్, సర్పంచ్ మహేందర్, ఉప సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, పలువురు అధికారులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.


