ఆశల పల్లకీలో.. | - | Sakshi
Sakshi News home page

ఆశల పల్లకీలో..

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనపై గంపెడాశలు

శ్రీశైలం నిర్వాసితులకు దక్కని న్యాయం

నాలుగు దశాబ్దాలుగా పరిహారం కోసం ఎదురుచూపులు

ఇంజినీరింగ్‌ కళాశాల, పరిశ్రమల

ఏర్పాటుపై హామీ దక్కేనా?

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారంపై ఆశలు నెలకొన్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్‌ బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధిపై ఇవ్వనున్న వరాలపై ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్‌ పనులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులతో పాటు ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపుతారన్న అంచనాలు ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌ నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పగా.. ఇప్పటివరకు ఎంతో మంది ఉద్యోగంతో పాటు పరిహారానికి సైతం నోచుకోలేదు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న భూ నిర్వాసితులు సీఎం రేవంత్‌రెడ్డిపై గంపెడాశలు పెట్టుకున్నారు.

నాలుగు దశాబ్దాలైనా..

శ్రీశైలం ప్రాజెక్టు కింద భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పరిహారం అందిస్తామనే ప్రభుత్వ ప్రకటన నీటిమూటగానే మారింది. అందుకోసం 1984లో జారీ చేసిన జీఓ 98 సైతం నేటీకీ అమలు కాలేదు. శ్రీశైలం ప్రాజెక్టుతో సర్వస్వం కోల్పోయిన వారిలో ఇంకా 2,156 మంది ప్రభుత్వ ఉద్యోగం, పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో కొంత మంది మరణించగా.. మరికొందరు వృద్ధాప్యానికి చేరువయ్యారు. ప్రతి ఎన్నికల సమయంలో శ్రీశైలం భూనిర్వాసితుల అంశం ఎన్నికల హామీగానే మిగులుతోంది. ఈ క్రమంలో సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం నిర్వాసితుల తరఫున ప్రతినిధులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు మంత్రులకు విజ్ఞప్తులు సమర్పించారు. అయితే జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తమకు పరిహారం విషయంలో సానుకూలంగా స్పందిస్తారని ఆశలు పెట్టుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement