కొత్తకోట రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించిందని.. ఉద్యమ స్ఫూర్తితోనే పార్టీ ముందుకు సాగుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. భవిష్యత్‌లో కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలంటే పార్టీ శ్రేణులు సంఘటితంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం కొత్తకోట సమీపంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ హోంమంత్రి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పార్టీ వనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మెట్టు శ్రీనివాసులు, దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జ్ పల్లె రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొని ప్రతి కార్యకర్త, అభిమానిని సభ్యుడిగా నమోదు చేయాలని సూచించారు. మండల, గ్రామస్థాయి నాయకులు పార్టీ ఇన్‌చార్జీలతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని.. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే అభివృద్ధి పరంగా అగ్రగామిగా నిలిచిందని, తొమ్మిదేళ్ల పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేశామన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు కొనసాగిస్తూ ప్రజలతో కలిసి పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, తామంతా ఒకే జట్టుగా కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్నామని చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పి.సుఖేషిని, సీడీసీ మాజీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.విశ్వేశ్వర్, మాజీ ఎంపీపీ గుంత మౌనిక, కౌన్సిలర్ అయ్యన్న, పార్టీ నాయకులు గాడీల ప్రశాంత్, కొండారెడ్డి, బాబురెడ్డి, న్యాయవాది యాదగిరి, ఆకుల శ్రీనివాసులు, ఎద్దుల నాగేష్, మొద్దుబాబు, చీర్ల నాగన్నసాగర్, కటికె శ్రీనివాసులు, నరేష్‌సాగర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ


