నకిలీ విత్తనాలతో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలతో అప్రమత్తంగా ఉండాలి

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

వనపర్తి: వానాకాలం సీజన్‌ ప్రారంభమవుతున్నందున జిల్లా రైతులు సాగుకు సిద్ధమవుతున్నారని.. నకిలీ విత్తనాల సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాలకు సంబంధించి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించగా కలెక్టర్‌ హాజరై పలు సూచనలు చేశారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని.. ఒకవేళ రైతులు వరి ధాన్యం వేయడానికి మాత్రమే మొగ్గు చూపితే, కేవలం సన్నరకం సాగుచేసేలా ప్రోత్సహించాలని సూచించారు. యూరియా పక్కదారి పట్టకుండా చూడాలని, గత సీజన్‌లో అధిక మొత్తంలో యూరియా తీసుకున్న వారిని గుర్తించి వారు దేనికోసం వినియోగించారనే అంశంపై తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్‌, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఆర్డీఓ సుబ్రమణ్యం, మండల వ్యవసాయ అధికారులు, తహసీల్దార్లు, ఎస్‌ఐలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

‘పది’లో 100 శాతం ఉత్తీర్ణతకు ప్రణాళికలు..

రాబోయే విద్యాసంవత్సరంలో పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. భౌతికశాస్త్రం, ఆంగ్లంపై శ్రద్ధ వహించి వెనుకబడిన విద్యార్థుల కోసం సులభమైన పద్ధతిలో ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భౌతికశాస్త్రం, ఆంగ్లం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది గణితంలో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించి, ప్రత్యేకంగా బోధించి మంచి ఫలితాలు సాధించినట్లే.. ఈసారి కూడా భౌతికశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టుల్లో అదే విధానాన్ని అమలు చేయాలన్నారు. విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యే విధంగా ప్రాథమిక అంశాలతో కూడిన ప్రత్యేక పుస్తకాలు రూపొందించాలని, నెలాఖరులోగా ఆయా పుస్తకాల తయారీ పూర్తి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ముందుగా ఈ ఏడాది పదోతరగతి చదివే విద్యార్థులకు సులభ పరీక్ష నిర్వహించి ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆయా సబ్జెక్టులతో పాటు అన్ని సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్‌ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement