జిల్లా విద్యాధికారి బదిలీ | - | Sakshi
Sakshi News home page

జిల్లా విద్యాధికారి బదిలీ

Jun 3 2026 12:15 AM | Updated on Jun 3 2026 12:15 AM

వనపర్తిటౌన్‌: జిల్లా విద్యాధికారి అబ్ధుల్‌ ఘనీని వికారాబాద్‌కు బదిలీ చేస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఆర్జేడీ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డికి జిల్లా విద్యాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని, బాధ్యతల స్వీకరణపై స్పష్టత కొరవడిందని జిల్లా విద్యాశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బదిలీ అయిన అబ్దుల్‌ ఘనీని ఇక్కడి బాధ్యతలు సైతం నిర్వర్తించాలని జిల్లా ఉన్నతాధికారులు మౌఖికంగా సూచించినప్పటికీ ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. డీఈఓ అబ్దుల్‌ ఘనీని మంగళవారం ఎంఈఎఫ్‌, ఎమ్మార్పీఎస్‌, జ్లిలా ఉపాధ్యాయ సంఘాల నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తపస్‌ జిల్లా ప్రధానకార్యదర్శి శశివర్ధన్‌, ఎస్‌ఎల్‌టీఏ జిల్లా ప్రధానకార్యదర్శి అమర్‌నాథ్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవ, జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మహాసభలకు తరలిరండి

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: నగరంలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో నిర్వహించే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు సీపీఎం శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. మంగళవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహబూబ్‌నగర్‌లో తొలిసారి నిర్వహిస్తున్న మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని, 20న జరిగే భారీ బహిరంగ సభలో త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌ పాల్గొంటారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణతో పెద్దఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం మహాసభల వాల్పోస్టర్లు విడుదల చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు వెంకట్రాములు, సాగర్‌, భూపాల్‌, ధర్మానాయక్‌, శ్రీరామ్నాయక్‌, రాములు, కిల్లె గోపాల్‌, కురుమూర్తి, జగన్‌, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

వేరుశనగ క్వింటా రూ.7,539

గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 193 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,539, కనిష్టంగా రూ. 4,589, సరాసరి రూ. 6,589 ధరలు లభించాయి. అదే విధంగా 2 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. రూ. 6189 ధర పలికింది. 28 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,270, కనిష్టంగా రూ. 2,129, సరాసరి రూ. 2,269 ధరలు వచ్చాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement