వనపర్తి: జిల్లావ్యాప్తంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, వార్డుసభలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యావరణ వారోత్సవాలు, గ్రామసభల నిర్వహణపై మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై దిశా నిర్దేశం చేశారు. పర్యావరణ వారోత్సవాలను కొనసాగిస్తూనే మండలాల వారీగా అనుకూలమైన తేదీలను చూసుకొని అన్ని గ్రామాల్లో గ్రామసభలు జరిగేలా చూడాలని డీపీఓను ఆదేశించారు. గ్రామసభల్లో బాల్య వివాహాల నిర్మూలన, రోడ్డు భద్రత, మహిళల భద్రతపై అవగాహన కల్పించాలని, రైతులు పంట మార్పిడి దిశగా అడుగులు వేసేలా చూడాలన్నారు. సన్నరకం వరి సాగును ప్రోత్సహించాలని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంకుడు గుంతల ప్రాధాన్యం, మొక్కల పెంపకంపై చైతన్యపర్చాలని, రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తం కావాలన్నారు. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లాస్థాయి వరకు అధికారులందరూ సమన్వయంతో గ్రామసభలు పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, జెడ్పీ సీఈఓ యాదయ్య, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్, డీఆర్డీఓ ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


