వనపర్తి: సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా మీడియా సంస్థలు విస్తృత ప్రచారం నిర్వహించాలని, బాధితులకు సత్వర సాయం అందించేందుకు హెల్ప్‌లైన్ నంబర్ 1930ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సునీతారెడ్డి కోరారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎస్పీ సైబర్ మోసాలు, 1930 గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా రోజురోజుకు కొత్త రూపాల్లో పెరుగుతున్నాయన్నారు. ఆన్‌లైన్, కస్టమర్‌కేర్‌తో మోసాలు, ఫేక్ లింక్‌లు, నకిలీ ఉద్యోగాలు, పెట్టుబడి పేరుతో మభ్యపెట్టడం వంటి ఘటనలు అధికమవుతున్నాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు ఎవరికీ తెలియజేయరాదని, సైబర్ బాధితులు ఆలస్యం చేయకుండా సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తతతో పాటు మీడియా ప్రతినిధుల పాత్ర కూడా ఎంతో కీలకమన్నారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూ బాధితులకు అందుబాటులో ఉన్న సేవలను చేరవేయడంలో సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. సమాజం సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడేందుకు పోలీసు, మీడియా, ప్రజలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో సైబర్ నేరాల నివారణ, డిజిటల్ భద్రత, ఆన్‌న్‌లైన్ మోసాల గుర్తింపు, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీ గిరిబాబు, సీఐ సుగంధ రత్నం, రూరల్ ఎస్‌ఐ హృషికేష్, జిల్లాలోని అన్ని పత్రికలు, ఛానళ్ల పాత్రికేయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


