ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా జయశంకర్‌ పోరాటం | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా జయశంకర్‌ పోరాటం

Jun 3 2026 12:15 AM | Updated on Jun 3 2026 12:15 AM

వనపర్తి: ప్రత్యేక రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా ప్రొ. జయశంకర్‌ చివరి శ్వాస వరకు పోరాడారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజపేట సమీపంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్‌ విగ్రహానికి బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకం, పార్టీ జెండాను ఆవిష్కరించారు. తర్వాత బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు సన్నాహాక సమావేశంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. జయశంకర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 14 ఏళ్లపాటు అహింసాయుతంగా ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. రాష్ట్ర సాధనతో తెలంగాణ ప్రజల్లో నెలకొన్న నిరాశ, నిస్ప్రహలను తొలగించి ఆత్మగౌరవాన్ని పెంపొందించారన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొమ్మిదేళ్ల పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సుపరిపాలన అందించినట్లు చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతు సంక్షేమం, మహిళలు, యువత, నిరుద్యోగులకు ప్రకటించిన పలు హామీలు ఇంకా నెరవేరలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి, జయశంకర్‌ ఆశయాల సాధనకు కేసీఆర్‌ చూపిన మార్గంలో ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో బీఆర్‌ఎస్‌ మళ్లీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకు లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement