వనపర్తి: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ ఆలోచనలు, ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని.. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాలకు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గత పాలకులు తెలంగాణ విప్లవ గళం గద్దర్‌ను అవమానిస్తే.. ప్రజా ప్రభుత్వం ఆయన కుమార్తె వెన్నెలకు సముచిత స్థానమిచ్చి గౌరవించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకొని జై తెలంగాణ అంటూ నినదించిన శ్రీకాంతాచారి తల్లికి మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం కల్పించినట్లు తెలిపారు. తెలంగాణ గీతాన్ని అందించిన కవి అందెశ్రీని గత పాలకులు ఎన్నో అవమానాల పాలు చేశారన్నారు. సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్, మీరాకుమార్ కృషితోనే తెలంగాణ ఆవిర్భవించిందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఉద్యమకారుల సంక్షేమానికి కమిటీ వేసి ఉద్యమకారుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.


