చనిపోతూ.. మరికొందరికి ప్రాణంపోస్తూ...
శృంగవరపుకోట: అనుకోని ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన యువకుడు చనిపోతూ చిరంజీవిగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే.. బొడ్డవర గ్రామానికి చెందిన మాసాడ కొండబాబు అలియాస్ భాను(33) విద్యుత్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఐదురోజుల కిందట కిల్తంపాలెం పంచాయతీ రాయివానిపాలెం వద్ద వీధిలైట్లు సరిచేయడం కోసం విద్యుత్ శాఖ ఉద్యోగుల ఆదేశాల మేరకు స్తంభం ఎక్కాడు. లైన్ మరమ్మత్తు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై రోడ్డుమీద పడిపోవడంతో తల, వెన్నెపూస, పక్కెటెముకులకు బలమైన దెబ్బలు తగిలాయి. హుటాహుటిన ఎస్.కోటలో ప్రైవేటు ఆస్పత్రిలో మెదడుకు శస్త్రచికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. భాను బ్రెయిన్‌డెడ్ అయిందని, బతికే అవకాశాలు తక్కువని, అవయవాలు దానం చేస్తే మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని ఆస్పత్రి వైద్యులు మృతుని కుటుంబీకులకు నచ్చజెప్పారు. అవయవదానానికి కుటుంబీకులు అనుమతించడంతో మృతుని అవయవాలు సేకరించారు. మృతుడికి ఇటీవల వివాహమైంది. ప్రస్తుతం అతని భార్య గర్భిణి. అంతలోనే భర్త దూరం కావడంతో కన్నీరుపెడుతోంది. మృతుని సోదరుడు మోపాడ గౌరీశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్.కోట ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. విద్యుత్‌శాఖ మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.


