ఆక్రమణల లెక్క.. పైసలిస్తే పక్కా..!
సాక్షి, పార్వతీపురంమన్యం: జిల్లా కేంద్రంలో చెరువుల ఆక్రమణల విషయంలో కనిపిస్తున్న ద్వంద్వ వైఖరిని చూసి పార్వతీపురం పట్టణ వాసులు విస్తుపోతున్నారు. పట్టణ నడిబొడ్డున సుమారు 11 ఎకరాలకుపైగా విస్తీర్ణం ఉన్న నెల్లి చెరువు ఆక్రమణలతో కుచించుకుపోయి.. 5 ఎకరాలకే పరిమితమైంది. మిగిలిన చెరువు ప్రాంతాన్నీ వదలక కొంతమంది నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పుడు చెరువు గర్భాన్నీ వదలకుండా.. డంపింగుయార్డుకు చెందిన చెత్తశుద్ధి అనంతరం మిగిలిన వ్యర్థాలను ఇక్కడ వేసేందుకు ఇటీవల సిద్ధమయ్యారు. దీనిపై చెరువు గట్టును ఆనుకుని అక్రమంగా ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలు అడ్డుకున్నారు. అదే రోజు మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బందిని పంపి.. పేదల ఆధార్ కార్డులు, ఇతర వివరాలు సేకరించి భయబ్రాంతులకు గురి చేశారు. పోలీసులు సైతం ఓ దఫా రంగ ప్రవేశం చేసి, అక్కడి నివాసితులతో మాట్లాడారు. అక్రమ నిర్మాణాల పట్ల ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరి విషయంలో విమర్శలు వ్యక్తంఅవుతున్న నేపథ్యంలో ఇదే ప్రాంతంలో కొన్ని నిర్మాణాలకు నోటీసులు ఇస్తుండడం గమనార్హం.
గుర్తిస్తే.. ‘నగదు బహుమతి’
జిల్లా కేంద్రంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కబ్జాలకు అంతే లేకుండా ఉంది. పట్టణంలోనే సుమారుగా 20కిపైగా చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణల గుప్పెట్లో ఉన్నాయి. లంకెల చెరువు, నెల్లిచెరువు, దేవునిబంద, కోదువానిబంద, కూర్మసాగరం, వరహాలగెడ్డ.. ఇలా ఒకటేమిటి అన్నీ చిక్కిశల్యమయ్యాయి. దాదాపు రెండేళ్లుగా వీటి విషయంలో ఒక వ్యూహాత్మక దందా నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆక్రమణలను గుర్తించడం.. ఓ వర్గం అక్కడి వారిని బెదిరించి పైసా వసూళ్లకు పాల్పడుతుండడం అలవాటుగా మారింది. వరహాలగెడ్డ దురాక్రమణ వెనుక రూ.కోట్లలో నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే విజయ్‌చంద్ర ఇటీవల అసెంబ్లీలో చెరువుల ఆక్రమణల విషయాన్ని ప్రస్తావించారు. గత రెండేళ్లలో జరిగిన దందా, ఆక్రమణల విషయంపైనా ఆయన స్పందిస్తే బాగుండేదన్న అభిప్రాయం పట్టణ వాసుల నుంచి వ్యక్తమవుతోంది. చెరువుల ఆక్రమణల విషయంలో జిల్లా కలెక్టర్ సైతం ఏమీ చేయలేకపోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. వరహాలగెడ్డ ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలో గత, ప్రస్తుత కలెక్టర్లకు ఎన్నోమార్లు ఫిర్యాదులు అందినా స్పందించిన దాఖలాలు లేవు.


