ఇదెక్కడి దారుణం బాబూ
● ఏపి రైతు సంఘం
జిల్లాకార్యదర్శి రాంబాబు
విజయనగరం ఫోర్ట్: అపరాల పంట నూర్పిడిలు జోరుగా సాగుతున్నాయి... రైతు చేతికి పంట అందొచ్చిన వేళ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం తగదంటూ ఏపీ రైతు సంఘం ఆందోళన వ్యక్తంచేసింది. ఇదెక్కడి అన్యాయం ‘బాబూ’ అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నాచేసింది. తక్షణమే అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేసింది. సంఘ జిల్లా కార్యదర్శి బుద్దరాజు రాంబాబు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో తక్కువ ధరకే పంట విక్రయించాల్సి వస్తోందన్నారు. క్వింటా వద్ద రూ.వెయ్యి నుంచి రూ.1800 వరకు రైతులు నష్టపోతున్నారన్నారు. పంటను విక్రయించిన తర్వాత కాకుండా రైతుల వద్ద ఉన్నప్పుడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తే ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు లోకవరపు ఆదినారాయణమూర్తి, కోడెల శ్రీనివాసరావు ఎస్.శ్రీరామ్మూర్తి, ఎం.ఎర్రినాయుడు, తదితరులు పాల్గొన్నారు.


