మానసిక క్షోభకు గురిచేస్తున్నారు
● కలెక్టర్‌కు ఫిర్యాదుచేసిన సింహగిరి కాలేజ్ ఆఫ్ పారామెడికల్ విద్యార్థులు
విజయనగరం ఫోర్ట్: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ వారు ఇచ్చిన ఉత్తర్వులు పాటించడం లేదు.. మమ్మల్ని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. తక్షణమే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి రేడియాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ బి.శివశ్రీధర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేవిమాధవిలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సింహగిరి కాలేజ్ ఆఫ్ పారామెడికల్ విద్యార్ధులు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ రాంసుందర్‌రెడ్డికి ఫిర్యాదుచేశారు. అనంతరం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. డీఎంఏటీ కోర్సులో చేరిన వారికి క్లినికల్ ట్రైనింగ్, థియరీ క్లాసులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రేడియాలజీ ప్రొఫెసర్ తీరుపై నాలుగు రోజుల కిందట సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజకు ఫిర్యాదు చేశామన్నారు. చదువుకు ఆటంకం కలగకుండా క్లినికల్ ట్రైనింగ్ ఇచ్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో కోల తేజశ్వని, బి.కొండమ్మ, ఎం.లక్ష్మి, ఎం.అరుణ, కె.పావని, సీహెచ్.అశ్విని, డి.డేవిడ్, ఎం.భానుతేజ, పి.రాంబాబు, ఆర్.ప్రవీణ్, ఎ.విద్యాసాగర్, కె.సతీష్, తదితరులు పాల్గొన్నారు.


